VK Saxena: ‘యమునా’ కాలుష్యానికి మీరే కారణం.. కేజ్రీవాల్‌కు ఎల్జీ సక్సేనా లేఖ
యమునా నదిలో కాలుష్యం పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: యమునా (Yamuna) నదిలో కాలుష్యం పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాలే (Kejriwal) కారణమని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా (VK saxena) ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు సోమవారం ఓ లేఖ రాశారు. ‘యమునా నది ఈ ఏడాది అత్యధిక కాలుష్య స్థాయికి చేరుకుంది. మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున దీనికి మీరే బాధ్యులు. న్యాయస్థానంలో పిటిషన్ వేయడం వల్ల యమునాలో జరుగుతున్న క్లీనింగ్ పనులు ఆగిపోయాయి. రంగపురి, కపషేరాను సందర్శించమని విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదు. స్వయంగా వీధుల్లోకి వచ్చి పరిస్థితిని సమీక్షించండి’ అని పేర్కొన్నారు. అంతకుముందు కేజ్రీవాల్ చేసిన ఓ పోస్టుపైనా సక్సేనా స్పందించారరు. ‘పదేళ్ల తర్వాత ఢిల్లీలోని దుర్భర పరిస్థితులపై మీరు కండ్లు తెరిచారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ సమస్యలపై ఇలానే దృష్టి సారించండి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు.