Amith shah: భవిష్యత్ సవాళ్లకు ఐబీ సిద్దంగా ఉండాలి.. కేంద్ర మంత్రి అమిత్ షా

భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంటిలిజెన్స్ బ్యూరో సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-12-23 19:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అన్నారు. ఐబీ పరిధిని మరింత విస్తరించాలని సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన 37వ ఇంటెలిజెన్స్ బ్యూరో సెంటినరీ ఎండోమెంట్ ఫండ్ లెక్చర్‌లో అమిత్ షా ప్రసంగించారు. అత్యాధునిక నిఘా సంస్థగా మారేందుకు ఐబీ సన్నద్ధం కావాలని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి యువ అధికారులు ముందుకు రావాలన్నారు. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని తెలిపారు. నేటి యుగంలో సార్వభౌమాధికారం భౌగోళిక సరిహద్దులకు మాత్రమే విస్తరించబోదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), సైబర్ స్పేస్ (cyber space) వంటి రంగాల్లో వేగవంతమైన మార్పులపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

భౌతిక హాని కలిగించే దేశ వ్యతిరేక శక్తుల పట్ల ప్రస్తుతం అప్రమత్తంగా ఉంటే సరిపోదని, ఇప్పుడు ఈ కొత్త సాంకేతిక బెదిరింపులను ఎదుర్కోవటానికి భద్రతా పర్యవేక్షణను పట్టిష్టం చేయాలని తెలిపారు. రానున్న కాలంలో ఐబీకి అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చి సన్నద్ధం చేయాల్సిన బాధ్యత యువ అధికారులపైనే ఉంటుందని స్పష్టం చేశారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, అప్పుడు బెదిరింపులు పెరుగుతాయని, దీన్ని ఎదుర్కోవడానికి బలమైన ఫ్రేమ్‌వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News