పోలీసులు లెక్కలేదు: వీహెచ్పీ, భజరంగదళ్!
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా ప్రజలతోనే కాదు పండుగలతోనూ ఆడుకుంటోంది. వైరస్ దెబ్బకు సుమారు ఆరు నెలలుగా పండగలన్నీ దూరం కాగా తాజాగా వినాయక చవితి మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ట ఏకంగా ప్రభుత్వం, హిందుత్వ సంస్థల మధ్య సవాలు విసురుకునే స్థాయికి తెచ్చింది. వినాయక చవితి పండుగకు కేవలం నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో మండపాల ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితులలోనూ మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని, ఎవరైనా మండపాలు ఏర్పాటు చేస్తే […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా ప్రజలతోనే కాదు పండుగలతోనూ ఆడుకుంటోంది. వైరస్ దెబ్బకు సుమారు ఆరు నెలలుగా పండగలన్నీ దూరం కాగా తాజాగా వినాయక చవితి మండపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ట ఏకంగా ప్రభుత్వం, హిందుత్వ సంస్థల మధ్య సవాలు విసురుకునే స్థాయికి తెచ్చింది. వినాయక చవితి పండుగకు కేవలం నాలుగు రోజుల వ్యవధి ఉండడంతో మండపాల ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితులలోనూ మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని, ఎవరైనా మండపాలు ఏర్పాటు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరించగా వారు చేసిన హెచ్చరికలను ఎంత మాత్రం అంగీకరించబోమని, ఎన్ని కేసులు నమోదు చేస్తారో చేసుకోండి, మేం మాత్రం మండపాలను ఏర్పాటు చేసి తీరుతామని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ లు ప్రకటించాయి. దీంతో నగరంలోని మండప నిర్వాహకులు మండపాలు పెట్టాలా ? వద్దా అనేతి తేల్చు కోలేక మండపాల నిర్వాహకులు డోలాయమానంలో పడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
వినాయక నవరాత్రులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వీహెచ్పీ, భజరంగ్ దళ్ లు వ్యతిరేకిస్తున్నాయి. మండపాలలో విగ్రహాల ఏర్పాటును ఆయా సంస్థలు ప్రతిష్టగా తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నోటికి నల్ల బట్ట కట్టుకుని నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. పోలీసుల బెదిరింపులు, అడ్డుకోవడాలను ప్రజలు లెక్క చేయకుండా ముందుకు వచ్చి వినాయక నవరాత్రులను గతంలో మాధిరిగానే నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించాయి. సుమారు రెండు నెలల క్రితమే విగ్రహాలకు, మంటపాల నిర్మాణానికి ముందస్తు చెల్లింపులు చేశామని, కరోనా సుమారు ఏడు నెలలుగా ప్రభావం చూపుతుండగా కనీసం రెండు నెలల ముందుగా ప్రభుత్వం ఈ విషయంలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదనే విమర్శలు అంతటా విన్పిస్తున్నాయి.
లోబడి నిర్వహించి తీరుతాం: సుభాష్ చందర్
‘రాష్ట్ర మంతటా ముఖ్యంగా భాగ్యనగరంలో గతంలో మాదిరిగా వినాయక మండపాల ఏర్పాటు ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు పోవద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పూజలు నిర్వహిస్తాం. తీర్థ ప్రసాద వితరణ ఉండదు. భక్తులు సామూహికంగా గుమికూడడం వంటివి, సామూహిక నిమజ్జనం లేకుండా చర్యలు తీసుకుంటాం. ముందుగా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించక పోవడంతో విగ్రహాల తయారీ దారులు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి విగ్రహాలు తయారు చేశారు. అంతేకాకుండా మండపాలలో విగ్రహాల కోసం ముందస్తు చెల్లింపులు కూడా జరిగాయి. ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తది. ఇప్పుడు మండపాలు, విగ్రహాలు వద్దంటే ఎలా?. ఈ విషయంపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. నవరాత్రులకు అనుమతులు ఇచ్చి సామూహికంగా పూజలు, నిమజ్జనం నిర్వహించరాదనే ఆంక్షలు పెడితే స్వాగతిస్తాం’ అని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ అంటున్నారు.