Import Duty: ఈవీ బ్యాటరీలు, మొబైల్ ఫోన్‌ల తయారీ పరికరాలపై దిగుమతి సుంకం రద్దు
సుంకాలను తగ్గించడం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచవచ్చు, ఎగుమతుల ద్వారా విదేశీ కంపెనీలతో పోటీ పడొచ్చని అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి స్థానిక తయారీదారులు బయటపడేందుకు ఈవీ బ్యాటరీలు, మొబైల్‌ఫోన్ తయారీలో వాడే అనేక వస్తువులపై దిగుమతి సుంకాలను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ముడి సరుకులపై సుంకాలను తగ్గించడం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచవచ్చు, ఎగుమతుల ద్వారా విదేశీ కంపెనీలతో పోటీ పడొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక బిల్లు-2025 ఆమోదం సందర్భంగా ఓటింగ్‌కి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈవీ బ్యాటరీలను తయారు చేసేందుకు ఉపయోగించే 35 వస్తువులు, మొబైల్‌ఫోన్ తయారీలో వాడే 28 పరికరాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. కాగా, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న అమెరికా ప్రతీకార సుంకం ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని పరిష్కారం కోసం ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. గత వారం, పార్లమెంటరీ కమిటీ స్థానిక తయారీదారులకు భరోసా ఇచ్చేందుకు ముడి పదార్థాల దిగుమతిపై సుంకాలను తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.