మంత్రి కేటీఆర్‌కు షాకిచ్చిన ‘సర్పంచులు’.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం..!
దిశ, వేములవాడ/ సిరిసిల్ల : అధికార పార్టీతో కలిసి ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని గెలుపొందిన ప్రతీ సర్పంచ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సర్దుబాటు, ప్రోత్సాహం లభించకపోవడంతో ప్రస్తుతం గ్రామాల్లో రాజీనామాల ‘పంచాయితీ’ జోరందుకుంది. అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా గ్రామ సర్పంచులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయాన్ని వేములవాడ నియోజకవర్గంలోని సర్పంచులు తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం […]
దిశ, వేములవాడ/ సిరిసిల్ల : అధికార పార్టీతో కలిసి ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని గెలుపొందిన ప్రతీ సర్పంచ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సర్దుబాటు, ప్రోత్సాహం లభించకపోవడంతో ప్రస్తుతం గ్రామాల్లో రాజీనామాల ‘పంచాయితీ’ జోరందుకుంది. అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా గ్రామ సర్పంచులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయాన్ని వేములవాడ నియోజకవర్గంలోని సర్పంచులు తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మధ్య బేదాభిప్రాయాలు రావడంతో అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ సహకరించడం లేదని ఆరోపిస్తూ రాజీనామాలు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన నిధులను బ్యాంకు నుండి తీయడానికి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ ఉండటం పలు వివాదాలకు మరింత బలం చేకూర్చి నట్టు అయ్యింది.
గ్రామ కమిటీల పేరిట. .
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వెల్లువెత్తుతున్న నిరసన గళాన్ని సర్దుబాటు చేయడానికి గులాబీ పార్టీ నాయకులు గ్రామ కమిటీల కార్యవర్గ ఎన్నికల పేరిట గ్రామాల్లో తిరుగుతున్నారు. పనిలో పనిగా ఎక్కడైతే పంచాయతీలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు సఖ్యత లేదో వారందరి జాబితాను సిద్ధం చేస్తున్నారు. అనంతరం వారందరినీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడానికి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కార్యవర్గం ఏర్పాటు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అందరికీ తెలిసిందే. ఇక రెండేళ్లలో గ్రామంలోని సర్పంచులను, పాలకవర్గాలు మచ్చిక చేసుకుని.. కాస్తయినా అభివృద్ధి చేస్తేనే ఓటు బ్యాంకు ఉంటుందని భావించి ముందస్తుగా గ్రామ కమిటీల పేరిట గ్రామాల్లో గులాబీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.
వేములవాడలో మొదలై సిరిసిల్ల వరకు..
గ్రామ సర్పంచులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు తొలుత బీజం పడింది వేములవాడ నియోజకవర్గంలోనే. చందుర్తి మండలంలోని సర్పంచులు అందరూ పార్టీలకతీతంగా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. దీనికి గానూ సన్నాహక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అందుబాటులో ఉండటం లేదని, ఉన్నా గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్లకు అవసరమైన నిధుల విడుదల కోసం కృషి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పేరిట చేసిన పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో సర్పంచులు అప్పుల పాలవుతున్నారు. అధికార పార్టీలో ఉన్నా.. పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోవడంతో ఇకపై ఏ పార్టీలో ఉంటే ఎంటి అనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మండలంలోని 19 మంది సర్పంచులు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వేములవాడ మండలంలోని సంకెపెళ్లి, చందుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచి స్థానంలో బంధువులు పెత్తనం చేస్తున్నారని, దానిని భరించలేని గ్రామస్తులు, గ్రామ పాలక సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే రాజీనామా చేస్తామని లిఖితపూర్వకంగా ఎంపీడీవోకు వార్డు సభ్యులు, ఎంపీటీసీ వినతి పత్రం సమర్పించారు. దీనిపై గురువారం విచారణకు ఎంపీడీవో వస్తున్నట్టు సమాచారం. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే రకమైన నిరసన గళం బలంగా వినిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ఇలాఖాలోనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే ఇక మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పరిష్కార చర్యలు ప్రారంభించినా..
మంత్రి కేటీఆర్ ఇలాఖాలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యలను ఏకరువు పెట్టడానికి ఇప్పటికే కేటీఆర్ కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. తన వద్ద ఉన్న వ్యక్తిగత సిబ్బందితో మండలాలను పర్యవేక్షించేందుకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ నుండి అధికారులు వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పులు రావడంలేదని అభిప్రాయాలున్నాయి. స్థానికంగా జరుగుతున్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా మంత్రికి వివరించేందుకు అధికారులు భయపడుతున్నట్లు సమాచారం. పెద్ద సారు మెప్పు పొందేందుకు మావద్ద ఎలాంటి సమస్యలు లేవని విషయాన్ని హైదరాబాద్‌కు చేరవేస్తున్నట్టు సమాచారం. వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు లేకపోవడంతో ఇక్కడి గ్రామ పంచాయతీల్లో నిరసనలు అధికం అవుతున్నాయి.