కరోనా ఎఫెక్ట్ : మూడు గంటల్లో 650
దిశ, వెబ్‌డెస్క్: మూడు గంటల్లో 650 అనగానే ఇదేదో కరోనా కేసులు అని భయపడిపోకండి. పూర్తి వార్త చదివాక మీరే ఒకింత నవ్వుకుని, ఒకింత కోప్పడుతారు. అవును… లాక్‌డౌన్ నేపథ్యంలో బార్లు, మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. ఎండకాలం పూట నాలుక మొద్దుబారిపోయి ఉన్న క్రమంలో బ్లాక్‌లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో దొడ్డిదారిన 150 రూపాయల క్వార్టర్ సీసా ధర రూ.500 నుంచి రూ.1500 వరకు, ఫుల్ సీసాను రూ.6 వేల నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: మూడు గంటల్లో 650 అనగానే ఇదేదో కరోనా కేసులు అని భయపడిపోకండి. పూర్తి వార్త చదివాక మీరే ఒకింత నవ్వుకుని, ఒకింత కోప్పడుతారు. అవును… లాక్‌డౌన్ నేపథ్యంలో బార్లు, మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. ఎండకాలం పూట నాలుక మొద్దుబారిపోయి ఉన్న క్రమంలో బ్లాక్‌లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో దొడ్డిదారిన 150 రూపాయల క్వార్టర్ సీసా ధర రూ.500 నుంచి రూ.1500 వరకు, ఫుల్ సీసాను రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. దీంతో బార్లు, మద్యం దుకాణాల బ్లాక్ మార్కెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 13 జిల్లాల బార్లు, మద్యం దుకాణాల్లోని నిల్వల వివరాలను పరిశీలించాలని స్వయంగా ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రీన్ జోన్‌లోని ఆత్మకూరు, సూళ్లూరుపేటలోని రెండు బార్లను పరిశీలించాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రాధయ్యను జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు.
ఈ క్రమంలో ఆత్మకూరు బార్‌ను తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. ఆ బార్‌లో గత నెల 21న ప్రారంభ నిల్వ నమోదు చేశారేగానీ, ముగింపు నిల్వలు నమోదు చేయలేదు. 21వ తేదీ ముందు రోజు వరకు ఆ బారులో సగటున 450 క్వార్టర్ బాటిళ్లు అమ్ముడుపోతుండగా.. లాక్‌డౌన్ ముందు రోజు మాత్రం 1000కి పైగా అమ్ముడయ్యాయి. దీని గురించి ప్రశ్నించగా.. లాక్‌డౌన్ ముందు రోజు పట్టణంలోని మిగతా మద్యం దుకాణాలు రాత్రి 8 గంటలకు ముందుగానే మూతపడటంతో తమ బారుకు మద్యం ప్రియులు పోటెత్తారని, రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగాయని తెలిపారు. ఆ మూడు గంటల వ్యవధిలో 650 మంది వారి బారుకి వచ్చారు. అందుకే ఆరోజు ముగింపు నిల్వ నమోదు చేయలేదని నిర్వాహకులు ఒప్పుకున్నారు. ఇది విన్న అధికారులు వారి మీద కేసు పెట్టి, బారుకు ముందూ, వెనక సీళ్లు వేశారు.
Tags – lockdown, corona, virus, bar, sales, quarter