షర్మిలకు జై కొట్టిన టీఆర్ఎస్ సర్పంచ్‌లు..
దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకూ షర్మిలకు ప్రజల మద్దతు భారీగా పెరుగుతోంది. వైఎస్సార్ అంటే అభిమానంతో వస్తున్న వాళ్లు కొందరుంటే.., ఇతర పార్టీల్లో ఆదరణ దక్కని వారు కూడా ఒక్కొక్కరుగా షర్మిలకు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు కూడా షర్మిలకు జై కొట్టడం విశేషం. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, అభిమానులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఇందుకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకూ షర్మిలకు ప్రజల మద్దతు భారీగా పెరుగుతోంది. వైఎస్సార్ అంటే అభిమానంతో వస్తున్న వాళ్లు కొందరుంటే.., ఇతర పార్టీల్లో ఆదరణ దక్కని వారు కూడా ఒక్కొక్కరుగా షర్మిలకు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు కూడా షర్మిలకు జై కొట్టడం విశేషం.
హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, అభిమానులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఇందుకు వేదికైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్‌కు చెందిన తొమ్మిది మంది సర్పంచ్‌లు, ఒక ఉపసర్పంచ్ షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలపడం గమనార్హం.
ప్రత్యామ్నాయం లేక ఇన్ని రోజులు టీఆర్ఎస్‌లో ఉన్నట్లు షర్మిల కార్యాలయ వర్గం స్పష్టం చేసింది. ఆ ప్రాంత ప్రజలకు వెఎస్సార్ అంటే ఎంతో గౌరవమని, ఆయన అక్కడి ప్రజలకు చేసిన మేలును మరువలేకనే షర్మిలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ గ్రామ సర్పంచ్ నాగనాథ్, ఉప సర్పంచ్ సాగర్, తేజాపూర్‌కు చెందిన భీంరావ్, శంకర్ గూడకు చెందిన లక్ష్మణ్, ధనోరా సర్పంచ్ జయరాం, పిప్రీకి చెందిన సుదర్శన్, గౌరాపూర్ కు చెందిన కృష్ణ, ఇచ్చోడకు చెందిన సునీల్ కుమార్, దేవాపూర్ కు చెందిన జాకేశ్, నిర్మల్ కు చెందిన రాజేశ్ షర్మిలకు మద్దతు తెలిపిన వారిలో ఉన్నట్లు షర్మిల కార్యాలయ వర్గం ప్రకటించింది.
వీరంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోవింద్ నాయక్, గంగాధర్ ఆధ్వర్యంలో వచ్చారని, త్వరలో మరికొంత మంది ప్రజాప్రతినిధులు కూడా షర్మిల పెట్టబోయే పార్టీలోకి చేరనున్నట్లు వారు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో గుస్సాడీ నృత్యాలతో కళాకారులు అలరించారు.