హుజురాబాద్‌ : హైస్పీడ్‌లో ‘కారు’.. బీజేపీకి బ్రేక్ పడినట్టేనా.?

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. గ్రామాల్లో ఉప ఎన్నిక వాతావరణం కొంతమేరకు కనిపిస్తున్నా.. రాజకీయ పార్టీల్లో మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది. మొన్నటిదాకా హుజురాబాద్‌లో మకాం వేసిన బీజేపీ నేతలు కూడా అక్కడి నుంచి ఖాళీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఇంకా ప్రచారమే మొదలుపెట్టలేదు. అక్కడ ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి […]

Update: 2021-08-02 21:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. గ్రామాల్లో ఉప ఎన్నిక వాతావరణం కొంతమేరకు కనిపిస్తున్నా.. రాజకీయ పార్టీల్లో మాత్రం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది. మొన్నటిదాకా హుజురాబాద్‌లో మకాం వేసిన బీజేపీ నేతలు కూడా అక్కడి నుంచి ఖాళీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఇంకా ప్రచారమే మొదలుపెట్టలేదు. అక్కడ ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే టీఆర్​ఎస్​ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. గ్రామాల్లో పథకాలను పరుగు పెట్టిస్తోంది.

పాదయాత్రకు బ్రేక్​..!

ఈటల రాజేందర్​ పాదయాత్రకు బ్రేక్​ పడినట్టే. మోకాలి ఆపరేషన్​ చేయాల్సి రావడంతో ఆయన వైద్యుల అబ్జర్వేషన్​లో ఉన్నారు. కనీసం నాలుగు వారాల పాటు ఆయన బెడ్​కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర కొనసాగించే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఈటల సతీమణి జమున పలు సమావేశాలకు హాజరవుతున్నారు. గ్రామాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈటల జమున ప్రచారాన్ని కొనసాగిస్తారా.. నిలిపివేస్తారా అనే దానిపై పార్టీలోనే క్లారిటీ లేదు.

మరోవైపు వారం రోజుల కిందట వరకు హుజురాబాద్​లో మకాం వేసిన బీజేపీ సీనియర్​ నేతలు ప్రస్తుతం తిరుగుముఖం పట్టారు. హుజురాబాద్​ సెగ్మెంట్​ బాధ్యతలను మీదేసుకున్న మాజీ ఎంపీ జితేందర్​రెడ్డితో పాటు నేతలు వెళ్లిపోయారు. దీంతో బీజేపీలో స్తబ్ధత నెలకొంది. స్థానిక నేతల్లో చాలా మంది ఇప్పటికే పార్టీని వీడటం కూడా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.

కాంగ్రెస్​కు కష్టకాలం..

రేవంత్​కు టీపీసీసీ చీఫ్​ పగ్గాలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో కొంత ఊపు వచ్చినా.. హుజురాబాద్​లో మాత్రం కష్టకాలం ఎదురవుతోంది. అక్కడ కనీసం అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్​ కూడా లేకుండా పోయింది. ఇక్కడి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన దామోదర రాజనర్సింహా ఒకసారి వెళ్లి వచ్చినా పరిస్థితి అంతగా ఆశించినట్లు కనిపించడం లేదు. మరోవైపు గతంలో కాంగ్రెస్​ ఇంచార్జీగా ఉన్న కౌశిక్​రెడ్డి టీఆర్​ఎస్​లో చేరడం, ఎమ్మెల్సీ కావడంతో కొంత కాంగ్రెస్​ వర్గం అటువైపు చేరింది. దీంతో ఇక్కడ జెండా ఎత్తుకుని తిరిగేవారు కూడా కనిపించడం లేదు.

ఇప్పటి వరకు కాంగ్రెస్​ ప్రచారం కూడా లేదు. అటు కాంగ్రెస్​ అధిష్టానంలోనూ అదే భయం కనిపిస్తోంది. ఒకవేళ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నిక నాటికి టీఆర్​ఎస్​ వలకు చిక్కుతారనే భయంతో ముందుగా అభ్యర్థిని కూడా ప్రకటించేందుకు జంకుతున్నారు. దీంతో హుజురాబాద్​లో కాంగ్రెస్​కు కష్టకాలం ఎదురవుతోంది. టీపీసీసీ చీఫ్​గా రేవంత్​కు ఇది తొలి పరీక్ష అయినప్పటికీ కొంత వెనకడుగు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

దూకుడు తగ్గని గులాబీ

ఈ రెండు పార్టీల పరిస్థితి సందిగ్థంలో ఉంటే అధికార పార్టీ మాత్రం దూకుడు కొనసాగిస్తోంది. హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసమే కొత్త పథకాలు వస్తున్నాయంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలిసిపోతోంది. దీనిలో భాగంగా ఈ నెల 16న హుజురాబాద్​ వేదికగా దళిత బంధు ప్రారంభం కానుంది. మరోవైపు కొత్త కార్డులు, 57 ఏండ్లకు పింఛన్లు వంటి స్కీంలు కూడా ఇక్కడి నుంచే మొదలుకానున్నాయి. మరోవైపు గ్రామాల్లో సీసీరోడ్లు, పంచాయతీ భవనాల పనులు కూడా యుద్దప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో టీఆర్​ఎస్​ నేతలు కూడా ప్రచారాన్ని తగ్గించడం లేదు. రోజుకో చోట మంత్రులో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదో ఓ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూనే ఉన్నారు.

ఉప ఎన్నికపై సందేహాలు..

మరోవైపు హుజురాబాద్​ ఉప ఎన్నికకు షెడ్యూల్​ ఎప్పుడు వస్తుందనేది తేలని ప్రశ్నగానే మారింది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించలేమంటూ సీఈసీకి లేఖ రాసిన సీఎస్​.. హుజురాబాద్​ బై ఎలక్షన్​పైనా అదే అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనే అంశం క్లారిటీకి రావడం లేదు. దీంతో రాజకీయ పార్టీల్లో ఒక విధమైన నిర్లిప్తత నెలకొంది. ఈ ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందంటూ బీజేపీ నేతలు సైలెంట్​ కాగా.. కాంగ్రెస్​ అసలే పట్టింపులేనట్టుగానే వ్యవహరిస్తోంది. కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ మాత్రం ప్రచారపర్వాన్ని కొనసాగిస్తోంది.

టీఆర్​ఎస్​ నుంచి బీసీ వర్గానికే ఛాన్స్​..?

ఇక టీఆర్​ఎస్​ అభ్యర్థిత్వం బీసీ వర్గానికి చెందిన నేతకు ఖరారు అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ ఆర్గనైజింగ్​ సెక్రెటరీ స్వర్గం రవితో పాటు పలువురు టీఆర్​ఎస్​లో చేరిపోయారు. అయితే టికెట్​ కోసం ఈ వలస నేతలతో ఏండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారు కూడా అధిష్టానం దగ్గర విన్నవించుకుంటున్నారు. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో.. ఇక బీసీ వర్గానికి టికెట్​ ఇస్తారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో టికెట్​ పోటీలో గెల్లు శ్రీనివాస్​, స్వర్గం రవి, పొనగంటి మల్లయ్య, బీసీ కమిషన్​ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్​తో పాటు కనుమల్ల విజయ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News