బహిరంగ లేఖలతో రైతులపై కపట ప్రేమ.. బీఆర్ఎస్‌పై మంత్రి తుమ్మల ఫైర్
గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు(Rythu Bandhu) పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు(Rythu Bandhu) పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అన్నారు. కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామంటే బీఆర్ఎస్నాయకులు నాటకాలకు తెరతీస్తున్నారన్నారు. మాయ మాటలతో మరొక సారి రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35 శాతం ఖర్చు చేశామని, రైతుబంధు పథకంలో 2019-20 సంవత్సరంలో రెండు పంటకాలాలలో పూర్తిగా డబ్బులు చెల్లించలేదన్నారు. గతేడాది యాసంగి రైతుబంధు రూ.7600 కోట్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు.
రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్ర కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రత మిషన్, నిధులు కూడా దాదాపు రూ.3005 కోట్లు రాకుండా చేసి తెలంగాణ రైతుల సంక్షోభానికి కారణమయ్యారని నిలదీశారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా చెల్లించక చేతులెత్తేస్తే, ఈ ప్రభుత్వం గత బకాయిలు చెల్లించి, వాటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నామన్నారు. 2018 రుణమాఫీలో రూ.20 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. పంటనష్టం సంభవించినపుడు కనీసం రైతులను పరామర్శించలేదని విమర్శించారు.