మంత్రివర్గ విస్తరణతో పార్టీలో సెగ.. హైకమాండ్‌కు ఆ ఎమ్మెల్యేల వినతి

మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.

Update: 2025-03-27 01:41 GMT
మంత్రివర్గ విస్తరణతో పార్టీలో సెగ.. హైకమాండ్‌కు ఆ ఎమ్మెల్యేల వినతి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కేబినెట్‌లో తమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. తమ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి వినతులు పంపించారు. తమ వర్గానికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరనే విషయాన్ని తెలుసుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌లను కలిసి విజ్ఞప్తులు అందజేశారు. జనాభా దామాషా ప్రకారం తమ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఎక్కడ చూసిన మాదిగ, లంబాడ ఎమ్మెల్యేల హడావుడి కనిపించింది.

గొంతు విప్పిన మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు

ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖలు రాశారు. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ‘రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ మధ్య భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ అవకాశం ఇవ్వలేదు. అందుకే కేబినెట్‌లో తమ కులం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు తమ వర్గానికి కేబినెట్‌లో చోటు లేదు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం కల్పించండి’ అంటూ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యేలు సైతం లేఖలో అధిష్ఠానానికి వివరించారు.

సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతులు

మంత్రివర్గ విస్తరణలో తమ వర్గాలకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌లను విడివిడిగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. తమ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వకపోతే క్షేత్ర స్థాయిలో ప్రజలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని వివరించినట్లు తెలుస్తున్నది. తమ డిమాండ్‌ను అధిష్ఠానానికి వివరించేందుకు గురువారం లేదా శుక్రవారం ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఆ ఫ్యామిలీల్లో ఒకటి కంటే ఎక్కువ పదవులు..

వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల్లో ఎంతమందికి పదవులు ఇస్తారు? అనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. ఇప్పటికే వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా, వివేక్ కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. వాళ్లకు అదనంగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అని మాదిగ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అందరికి అవకాశం ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని సైతం కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే డిస్కషన్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది.

అధిష్ఠానం పునరాలోచణ?

కేబినెల్ విస్తరణలో తమ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేల డిమాండ్లు అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఈ పరిణామాలతో ఇప్పటికే ఫైనల్ చేసిన జాబితా విషయంలో అధిష్ఠానం పున:పరిశీలిస్తుందా? లేక యథావిథిగా ముందుకు వెళ్తుందా? అనే చర్చ జరుగుతున్నది. మంత్రివర్గ విస్తరణతో మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయానికి హైకమాండ్ వస్తే జాబితాలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందనే టాక్ పార్టీ వర్గాల్లో మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, వివేక్.. కాంగ్రెస్ లీడర్లు, పార్టీపై చేసిన విమర్శలు, ఆరోపణలకు చెందిన వీడియో క్లిప్స్‌ను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అలాంటి లీడర్లకు మంత్రి పదవులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

Tags:    

Similar News