వాగు దాటలేక నరకయాతన.. గిరిజన మహిళ ప్రసవ వేదన
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వర్షాలు, వరదల సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మారుమూల మండలాల్లో నివసిస్తున్న గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర అనే గర్భిణీకి ప్రసవం కోసం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. శుక్రవారం […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వర్షాలు, వరదల సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మారుమూల మండలాల్లో నివసిస్తున్న గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర అనే గర్భిణీకి ప్రసవం కోసం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నక్కలపల్లికి వెళ్ళే దారిలో ఉన్న వాగు ఉప్పొంగటంతో ఆ గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్రకు నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించగా ప్రసవం కోసం తల్లిగారింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు మొదలవగా.. వెంటనే 108కి కాల్ చేశారు. గ్రామానికి వెళ్ళే దారి మధ్యలోని వాగు.. భారీ వర్షానికి ఉప్పొంగటంతో వాహనం వాగు దాటలేని పరిస్థితి ఉండటంతో.. వాగు వద్దే నిలిపి వేశారు.
అతి కష్టంమీద ప్రయివేట్ వాహనం సహాయంతో వాగు వద్దకు చేరుకున్న గర్భిణీ వాగు దాటలేక వాగు అవతలి ఒడ్డు వద్దే ఉండిపోయింది. సమయం మించిపోవడం, ప్రసవ వేదన తీవ్రం అవుతుందటంతో 108 సిబ్బంది జల మహేశ్, ఫరీద్ అహ్మద్, గ్రామస్తులు ముందుకొచ్చి ఆ గర్భిణీని వాగు దాటించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో కోటపల్లి పీహెచ్సీకి తరలించే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలో పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో మధ్యలో వాహనం ఆపేసి ప్రసవం జరిపించగా.. ఆ మహిళ బాబుకి జన్మనిచ్చింది. అక్కడి నుండి తల్లిబిడ్డ ఇద్దరినీ కోటపల్లి పీహెచ్సీకి తరలించారు. అత్యవసర సమయంలో సకాలంలో స్పందించిన 108 సిబ్బంది, గ్రామస్తులకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
నక్కలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారుగా 6 వరకు గ్రామాలు ఉండగా ఇప్పటివరకు ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కోటపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి నక్కలపల్లి, బద్దంపల్లి, చామనపల్లి, బొమ్మెన గ్రామాలు ఉండగా ఈ మార్గంలో సరైన రోడ్డు, బ్రిడ్జిలు లేక ప్రతి సంవత్సరం ఈ మార్గంలోనే గ్రామ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు, వాగులపై న బ్రిడ్జి నిర్మాణాలపై దృష్టి పెట్టాలని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.