ఈటల ఎఫెక్ట్.. కరీంనగర్ జిల్లాలో బదిలీల జాతర
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత కరీంనగర్ జిల్లాలో బదిలీల తంతు కొనసాగుతోంది. హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు బదిలీతో మొదలైన ఈ ప్రక్రియ సీపీ వరకూ చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పని చేస్తున్న సీఐలు, ఎస్సైలు కూడా బదిలీ అయ్యారు. ఆ తరువాత ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు బదిలీ కాగా, ఇటీవల జమ్మికుంట, హుజురాబాద్ కమిషనర్లను మళ్లీ షిఫ్ట్ చేశారు. కరీంనగర్ కలెక్టర్ శశాంకను ట్రాన్స్‌ఫర్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత కరీంనగర్ జిల్లాలో బదిలీల తంతు కొనసాగుతోంది. హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస రావు బదిలీతో మొదలైన ఈ ప్రక్రియ సీపీ వరకూ చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పని చేస్తున్న సీఐలు, ఎస్సైలు కూడా బదిలీ అయ్యారు. ఆ తరువాత ఆర్డీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు బదిలీ కాగా, ఇటీవల జమ్మికుంట, హుజురాబాద్ కమిషనర్లను మళ్లీ షిఫ్ట్ చేశారు.
కరీంనగర్ కలెక్టర్ శశాంకను ట్రాన్స్‌ఫర్ చేసి వారం తిరగక ముందే సీపీ కమల్ హాసన్ రెడ్డిని కూడా బదిలీ చేశారు. దీంతో, కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగంలో బదిలీల జాతర కొనసాగుతోందనే చెప్పాలి. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్‌పైనే తన ప్రధాన దృష్టిని సారించింది. ఓ వైపున అభివృద్ధి పనుల కోసం నిధుల వరద పారిస్తుంటే.. మరో వైపున పార్టీలోకి చేర్పించుకునేందుకు వ్యూహాలు నడుస్తున్నాయి.
ఇదే సమయంలో ఈటల మార్క్ లేకుండా చేసేందుకు అధికార యంత్రాంగాన్ని కూడా మారుస్తోంది ప్రభుత్వం. ఈటల మంత్రిగా పనిచేసినప్పటి పరిచయాలు ఆయనకు లాభించే అవకాశం ఉంటుందన్న యోచనలోనే ఈ బదిలీల తంతు సాగుతోందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారి ఒకరి బదిలీ వెనక కూడా అత్యంత రహస్యమైన విషయం దాగుందని అంటున్నారు కొందరు. ఆ కారణంగానే హఠాత్తుగా ఆయనపై బదిలీ వేటు వేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈటలకు అనుకూలంగా ఎలాంటి వాతావరణం ఉండకూడదన్న యోచనతోనే బదిలీలు జరుగుతున్నాయన్న అపవాదు కూడా ప్రభుత్వంపై పడుతోంది. అయితే, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కన్నా ఈటల రాజేందర్ ఓడిపోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.