రేవంత్ జాదూకియా.. టీపీసీసీ వెంటే ‘కొక్కిరాల’

దిశప్రతినిధి, ఆదిలాబాద్ : మూడు గ్రూపులు.. ఆరుగురు లీడర్లు అన్నట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నాయకులంతా.. టీపీసీసీ కొత్త రథసారధి నాయకత్వంలో ఏకమవుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా తాజాగా మేమంతా ఒక్కటేనంటూ సంకేతాలిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తొలిసారి […]

Update: 2021-07-25 20:05 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్ : మూడు గ్రూపులు.. ఆరుగురు లీడర్లు అన్నట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నాయకులంతా.. టీపీసీసీ కొత్త రథసారధి నాయకత్వంలో ఏకమవుతున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా తాజాగా మేమంతా ఒక్కటేనంటూ సంకేతాలిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తొలిసారి భేటీ అయ్యారు. విభేదాలు వీడి పార్టీ బలోపేతం కోసం పని చేయాలనే సంకేతాలిచ్చారు. ఇద్దరు కీలక నేతలు కలువటంతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందనే ఆశలో పార్టీ శ్రేణులున్నాయి.

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని ఓ దశాబ్దం పాటు శాసించారు. గతంలో దివంగత సీఎం వైఎస్ఆర్, మాజీ ముఖ్యమంత్రులు కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ ఆయన మాటే చెల్లుబాటు అయింది. కేవీపీ రామచంద్రరావుకు సన్నిహితుడు కాగా వైఎస్ టైంలో ఆయనదే హవా. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వారి కుటుంబంతో వ్యాపార, వ్యక్తిగత, రాజకీయంగా మంచి సంబంధాలుండేవి. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవటం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆయన ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. 2014లో సిర్పూర్(టి), 2018లో మంచిర్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.

తాజాగా టీపీసీసీ కొత్త సారధి ఎంపికలోనూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేరనే ప్రచారం సాగింది. టీపీసీసీ అధ్యకుడిగా ఉత్తర తెలంగాణ నుండి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులను నియమించాలని అధిష్టానాన్ని కోరినట్లు ఇటీవల విలేకరుల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. కొత్త సారథి నియామకం అయ్యాక ఆయన్ను కలిసేందుకు వెళ్లలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా దూరంగానే ఉన్నారు. అదీ కాక మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు ఏలేటితో పొసగక పోవటంతో గత పదేళ్లుగా రెండు గ్రూపులుగా వీడిపోయింది. ఏలేటికి, రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉండటం తాజాగా ఏలేటికి కీలక పదవి ఇవ్వటంతో కేపీఆర్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఒకదశలో పార్టీని వీడుతారనే ప్రచారం సాగగా ఆయన మాత్రం తాను పార్టీలోనే ఉంటానని, పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని ప్రకటించారు.

అలాంటిది తాజాగా జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. హైదరాబాద్ చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక.. ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో తొలిసారి భేటీ అయ్యారు. దీంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే సంకేతాలివ్వటంతో పాటు బహిరంగంగానే స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కదం తొక్కుతామని.. ఈ సభకు ప్రేంసాగర్రావు నాయకత్వం వహించాలని రేవంత్ పేర్కొన్నారు. దీంతో కొక్కిరాల మళ్లీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఆయన యాక్టివ్ అవుతారని సమాచారం. మరోవైపు కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా తనను వ్యతిరేకించిన వారిని కూడా రేవంత్ కలుపుకుని పోవటంతో కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వెల్లివిరుస్తోంది.

Tags:    

Similar News