రేపే అక్షయ తృతీయ.. బంగారం ఎలా కొనాలి?
రేపు అక్షయ తృతీయ… ప్రతి ఏటా అక్షయ తృతీయ వస్తుందంటే చాలు. మహిళలంతా బంగారం షాపుల ముందు క్యూ కట్టేవారు. ఈ ఏడాది అలాటి దృశ్యాలు లేవు. పవిత్ర దినం సెంటిమెంటుతో ఎంతో కొంత బంగారం కొని దాచుకోవడం ప్రతి ఇంటా జరిగే తంతే.. అయితే ఈ ఏడాది ఆ వ్యాపారం రూపు మార్చుకుంది. షాపులు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ను నమ్ముకుంటున్నారు. గతంలో బంగారాన్ని ఆన్‌లైన్ మాధ్యమంగా విక్రయించే షాపులే ఇప్పుడు బంగారాన్ని విక్రయించే వెసులుబాటును […]
రేపు అక్షయ తృతీయ… ప్రతి ఏటా అక్షయ తృతీయ వస్తుందంటే చాలు. మహిళలంతా బంగారం షాపుల ముందు క్యూ కట్టేవారు. ఈ ఏడాది అలాటి దృశ్యాలు లేవు. పవిత్ర దినం సెంటిమెంటుతో ఎంతో కొంత బంగారం కొని దాచుకోవడం ప్రతి ఇంటా జరిగే తంతే.. అయితే ఈ ఏడాది ఆ వ్యాపారం రూపు మార్చుకుంది. షాపులు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌ను నమ్ముకుంటున్నారు. గతంలో బంగారాన్ని ఆన్‌లైన్ మాధ్యమంగా విక్రయించే షాపులే ఇప్పుడు బంగారాన్ని విక్రయించే వెసులుబాటును దక్కించుకున్నాయి.
అయితే వారు కూడా కొనుగోలు చేయగానే బంగారాన్ని డెలివరీ చేసే వెసులుబాటు లేదు. ఇప్పుడు నచ్చిన ఆభరణం లేదా ముడి బంగారాన్ని కొనుగోలు చేస్తే.. లాక్‌డౌన్ ఆంక్షలు ముగిసే సమయానికి వాటిని అందుకోవచ్చు. కాగా, ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీల మధ్యే అక్షయ తృతీయ పోటీ నెలకొంది. ఈ షాపులు బంగారం కస్టమర్ల ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో అక్షయ తృతీయను పురస్కరించుకుని వారికి మెసేజ్‌లు, ఫోన్‌ల రూపంలో డిస్కౌంట్ల, ఆఫర్‌లను చెబుతూ, కొనుగోలు దారులను ఊరిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలోకి వెళ్లి నచ్చిన వస్తువును ఎంచుకుని, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి, లాక్‌డౌన్ ముగియగానే వస్తువు పట్టుకెళ్లవచ్చు. కావాలంటే ఇంటికే డెలివరీ చేస్తారు కూడా.
ఇక్కడే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా ఆందోళన నేపథ్యంలో పోలీసు కేసులు బయటకు రావడం లేదని, అయితే సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు కాపుగాసి ఉంటున్నాయని, వినియోగదారుడు ఏమాత్రం ఆదమరిచినా లేదా అవగాహనా రాహిత్యంతో ఉన్నా కేటుగాళ్లు మోసం చేస్తారని చెబుతున్నారు. మరోవైపు డెలివరీ పేరిట డబ్బులు గుంజేవాళ్లు, ఆభరణాలను తారుమారు చేసేవారు కూడా ఉంటారని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు కరోనా నేపథ్యంలో బంగారం నమ్మకమైన పెట్టుబడి దారుగా ఉంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ద్రవ్యలోటు వంటి సమస్యల నేపథ్యంలో బంగారమే సిసలైన ఆర్థిక వనరుగా కనిపిస్తోంది. ఇప్పటికే ధాయ్‌లాండ్ వాసులు కరోనా కష్టాలు అధిగమించేందుకు బంగారం విక్రయిస్తున్నారని, థాయ్ చరిత్రలో లేని విధంగా షాపుల్లో బంగారం కొనుగోలు జరుగుతోందని అంతర్జాతీయ పత్రికల్లో ప్రధాన శీర్షికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రధాన షేర్లన్నీ తోకముడిచి నేల చూపులు చూస్తున్నాయి. పేరెన్నికగన్న కంపెనీల షేర్లు కూడా కరోనా థాటికి పతనం బాటపట్టాయి. ఈ నేపథ్యంలో బంగారం నమ్మకమైన పెట్టుబడిగా కనిపిస్తోంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం 2019లో భారత్‌లో 690.4 టన్నుల బంగారం అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700, 800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండవని, 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ అంచనా వేస్తున్నారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ తృతీయ వాటా 30 నుంచి 40% ఉంటుందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులన్నీ తల్లకిందులు కావడంతో లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత ఉద్యోగాలు ఉంటాయో, ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో అక్షయ తృతీయకు బంగారం కొనుగోళ్లు పెద్దగా జరిగే అవకాశం లేదని సగటు పౌరులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సారి 20 నుంచి 30% మంది ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Tags: gold, akshaya triteeya, gold market, bulian market, gold price