సమాజాన్ని వదిలి..సామాజిక దూరం పాటిస్తూ..

మహారాష్ట్రలో ఓ కుటుంబం వెరైటీ జీవనం దిశ, కరీంనగర్: చుట్టూ అడవులు. ఓ పక్కన విస్తరించి ఉన్న గుట్టలు, మరో వైపున ఇంద్రావతి నది. వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే. కను చూపు మేరలో కనిపించని పట్టణాలు. ఈ ఊరు దాటి పట్నం వెళ్లే వారిని వేల్ల మీద లెక్కపెట్టవచ్చు. అయినా ఆ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) తమకు సోకవద్దని భావించి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. […]

Update: 2020-04-10 18:55 GMT

మహారాష్ట్రలో ఓ కుటుంబం వెరైటీ జీవనం

దిశ, కరీంనగర్:
చుట్టూ అడవులు. ఓ పక్కన విస్తరించి ఉన్న గుట్టలు, మరో వైపున ఇంద్రావతి నది. వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే. కను చూపు మేరలో కనిపించని పట్టణాలు. ఈ ఊరు దాటి పట్నం వెళ్లే వారిని వేల్ల మీద లెక్కపెట్టవచ్చు. అయినా ఆ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ -19) తమకు సోకవద్దని భావించి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏంటా నిర్ణయమనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాఘడ్ తాలుకా కేంద్రం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ తాలుకా గురించి నేటికీ జిల్లా కేంద్రంలోని చాలా మందికి తెలియదంటే భామ్రాఘడ్ ఎంత దూరంలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గడ్చిరోలి జిల్లా కేంద్రానికి దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ తాలుకా కేంద్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

భామ్రాఘడ్‌కు చెందిన అజయ్, సంజయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో సహా ఊరొదిలి వెళ్లిపోయారు. తమ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్న ఇంద్రావతి నది తీరంలో తాత్కలిక షెడ్ వేసుకుని జీవిస్తున్నారు. పక్కనే గల గల పారే ఇంద్రావతి నదిలో స్నానం చేసి అక్కడే వంటా వార్పు చేసుకుని జీవిస్తున్నారు. తమ గ్రామస్తులతో సంబంధం లేకుండా ఊరొదిలి ప్రశాంతంగా ఇంద్రావతి ఒడ్డున ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆ అన్నదమ్ములు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి నది సమీపంలోనే జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు.

ఒకరి నుంచి ఒకరికి సోకి తద్వారా తమకు కరోనా మహమ్మారి సోకకూడదన్న కారణంగానే మకాం మార్చి ఇంద్రావతి ఒడిలో ఉంటున్నామనిఅంటున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ తమ గ్రామానికి కరోనా రాదన్న అతి నమ్మకం పెట్టుకోకుండా ఈ అన్నదమ్ములు ఇద్దరూ సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటిస్తుండటం విశేషం. కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షల్లో కొవిడ్ 19 పాజిటివ్ వస్తోందని ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని జీవిస్తున్న సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. కానీ, ఈ అడవి బిడ్డలు మాత్రం అలాంటి పరిస్థితే తమకు ఎదురు కావద్దని ముందు చూపుతో ఊరు వదిలి పెట్టా బేడా సర్దుకుని వెళ్లిపోయింది.

సామాజిక దూరం పాటించండి మహాప్రభో అంటూ అధికార యంత్రాంగం చెవిలో జోరీగల చెబుతున్నా పట్టించుకోకుండా ఉంటున్న వారికంటే వైవిధ్యంగా ఈ అడవి బిడ్డలు జీవిస్తున్నారు. కరోనా తమ ఇంటిని, ఒంటిని చేరవద్దని భావించిన ఇద్దరన్నదమ్ములు సామాజిక దూరం కాదు సమాజ దూరం పాటించడమే మేలనుకుని ఆ పద్ధతిలో జీవిస్తున్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఈ అటవీ ప్రాంత అన్నదమ్ములను చూసైనా చైతన్యం తెచ్చుకోవాలనీ, సామాజిక దూరం పాటించేలా మార్పు రావాలని ఆశిద్దాం.

Tags: indravati river, two brothers family, social distance, lockdown, covid 19

Tags:    

Similar News