ఆదర్శనీయమైన ఆటోవాలా… అన్నాదురై

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు. జీవితంలో రకరకాల కారణాలు మన లక్ష్యానికి దూరంగా ప్రయాణించేలా చేస్తాయి. చెన్నైకి చెందిన ‘అన్నాదురై’ జీవితం కూడా అలాంటిదే. పాఠశాల స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకున్న ఆ పిల్లోడు పెద్దయ్యాక బిజినెస్ మ్యాన్ కావాలని ఆశపడ్డాడు. కానీ కుటుంబ ఆర్థికపరిస్థితుల వల్ల తన మార్గాన్ని మార్చుకుని ఆటో‌డ్రైవర్‌గా మారాడు. విధిని అంగీకరించి తను […]

Update: 2021-05-13 03:33 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే తమ కలను సాకారం చేసుకుంటారు. జీవితంలో రకరకాల కారణాలు మన లక్ష్యానికి దూరంగా ప్రయాణించేలా చేస్తాయి. చెన్నైకి చెందిన ‘అన్నాదురై’ జీవితం కూడా అలాంటిదే. పాఠశాల స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకున్న ఆ పిల్లోడు పెద్దయ్యాక బిజినెస్ మ్యాన్ కావాలని ఆశపడ్డాడు. కానీ కుటుంబ ఆర్థికపరిస్థితుల వల్ల తన మార్గాన్ని మార్చుకుని ఆటో‌డ్రైవర్‌గా మారాడు. విధిని అంగీకరించి తను చేస్తున్న పనిలోనే ఉత్తమంగా నిలిచి కస్టమర్ల మన్ననలు అందుకుంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ తను తోచిన సాయం చేస్తున్నాడు. తన ఆటోలో సకల సౌకర్యాలతో కస్టమర్స్ మళ్లీ మళ్లీ ప్రయాణించేలా చేయడమే కాకుండా, ఒక్కసారైనా తన ఆటోలో ప్రయాణించాలని చెన్నై వాసులు అనుకునేలా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అన్నాదురై తండ్రితో పాటు అతడి సోదరులు కూడా ఆటోడ్రైవర్లుగానే పనిచేస్తున్నారు. బాగా చదువే తెలివి తేటలున్నా.. ఎడ్యుకేషన్‌కు అయ్యే ఖర్చును భరించలేని కుటుంబ పరిస్థితులను చూసి డ్రైవర్‌గా మారాడు అన్నాదురై. ఆటోడ్రైవర్ల అందరికంటే ఎంతో భిన్నంగా ఉండాలని భావించిన దురై తన యుఎస్‌పి గురించి ఆలోచించాడు. మార్కెటింగ్ మేనేజర్‌లా తన కస్టమర్లు తన నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునేవాడు. ఎక్కువ మంది ‘భద్రత’ ‘గౌరవం’ కోరుకుంటున్నారని గమనించాడు. వారికోసం వార్తపత్రికలు, మ్యాగజైన్స్ ఆటోలో అందుబాటులో ఉంచడం ప్రారంభించాడు. కానీ ఎక్కువ మంది ఫోన్ వాడటం గమనించిన అతడు ఆటోలో ఉచిత వైఫై అందించాడు. దాంతో తన కస్టమర్స్ దురైతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో ‘ఈ ఆటోలో ఉచిత వైఫై ఉంది!’ అంటూ పోస్ట్ చేయడం ప్రారంభించారు. కస్టమర్ల మనుసు చదివేసిన ఈ ఆటోడ్రైవర్ వారిని మరింత ఆకట్టుకుని, వారితో కస్టమర్ రిలేషన్‌షిప్ పెంచుకోవడానికి 9 భాషల్లో ‘హలో’ చెప్పడం నేర్చుకున్నాడు. తద్వారా ఇతర రాష్ట్రాల ప్రయాణికులు కూడా దురైకి ఫిదా అయిపోయారు. డీమోనిటైజేషన్ సమయంలో నగదు లేనివారి కోసం కార్డ్ స్వైప్ చేసే అవకాశం కల్పించాడు.

‘నేను ఐప్యాడ్ కొనుగోలు చేసి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్ర్కిప్షన్ తీసుకున్నాను. మినీ ఫ్రిజ్, చార్జింగ్ పాయింట్, ఫ్యాన్, అలెక్సా కూడా కస్టమర్ల కోసం ఆటోలో ఫిక్స్ చేశాను. ‘చెన్నైలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందని అలెక్సా తరచు నాకు చెబుతుంది. దీంతోపాటు ఉపాధ్యాయులకు ఉచితంగా ట్రావెలింగ్ ఫెసిలిటీ అందిస్తున్నాను. అంతేకాదు ఎవరైనా నా ఆటోలో 40 కంటే ఎక్కువ రైడ్‌లు చేస్తే వారికి రూ .1000 బహుమతిగా అందిస్తున్నాను. చాలామంది నేను క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతుంటే.. డబ్బు కంటే విలువైన మంచి స్నేహితుడిని సంపాదించామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది నేను సంపాదించుకున్న అభిమానం మాత్రమే కాదు నాకు దక్కిన గొప్ప ప్రశంస కూడా. నేను వ్యాపారవేత్త కాకపోయినా.. చేస్తున్న పనిలోనే ఉత్తమంగా సేవలందిస్తున్నాను. ఎంతోమంది కస్టమర్లు నా నంబర్ తీసుకొని, వారికి వీలునప్పుడు నాతో మాట్లాడుతుంటారు. వారి జీవిత కథలను కూడా నాతో పంచుకుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం నాది! ఇతర వ్యాపారవేత్తల మాదిరిగానే నేను నమ్మే సిద్ధాంతం ‘కస్టమర్ భగవాన్ హై!’ – అన్నా దురై, ఆటోడ్రైవర్

Tags:    

Similar News