ప్లీనరీ గురి హుజూరాబాద్ పైనే.. సీఎం ప్రసంగమంతా దాని చుట్టే!
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్లీనరీ వేదికమీద పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన తెచ్చారు. అక్కడి ఓటర్లకు అప్పీల్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను అక్కడి ఓటర్లు తప్పకుండా గెలిపించుకుంటారన్న సంగతి తనకు తెలుసునని, నవంబరు 4న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. ప్లీనరీ వేదిక నుంచి తాను చేస్తున్న ప్రసంగాన్ని అక్కడి ఓటర్లు టీవీల ద్వారా వింటున్నారని కూడా పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను, దళితబంధును […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్లీనరీ వేదికమీద పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన తెచ్చారు. అక్కడి ఓటర్లకు అప్పీల్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను అక్కడి ఓటర్లు తప్పకుండా గెలిపించుకుంటారన్న సంగతి తనకు తెలుసునని, నవంబరు 4న ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. ప్లీనరీ వేదిక నుంచి తాను చేస్తున్న ప్రసంగాన్ని అక్కడి ఓటర్లు టీవీల ద్వారా వింటున్నారని కూడా పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను, దళితబంధును జోడించి తన ప్రసంగంలో ఎక్కువ సమయాన్ని ఈ అంశాలకే కేటాయించారు. ప్లీనరీలో మొత్తం ఏడు తీర్మానాలకు ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ తీర్మానాలు మాత్రం ప్లీనరీలో ప్రతిబింబించలేదు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ప్లీనరీని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు బహిరంగంగా వ్యాఖ్యానించుకుంటున్నాయి. అక్కడి దళితులు అదృష్టవంతులని, ఎన్నికల కమిషన్ ఆంక్షల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన దళితబంధు నవంబరు 4 నుంచి మళ్లీ ప్రారంభమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనే దగ్గరుండి మరీ అమలు చేయిస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టి ఆపేయించినా, దానికి అధికారం నవంబరు 4వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఆపడం దాని తరం కాదని నొక్కిచెప్పారు. ప్లీనరీ వేదికగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గట్టి హెచ్చరిక చేశారు.
మరోమారు పార్టీ అధ్యక్షుడిగా…
టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ప్లీనరీ సందర్భంగా మరోమారు ఎన్నికయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు తన ప్రారంభోపన్యాసంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం మీదుగా పరిపాలన వరకు పలు ఘట్టాలను ప్రస్తావించారు. అనంతరం పార్టీ కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన వివరాలను ప్రస్తావించి మొత్తం 18 నామినేషన్లు వచ్చాయని, అన్నీ కేసీఆర్ అధ్యక్షుడిగానే ప్రతిపాదించినందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. వెంటనే కేసీఆర్‌కు వేదిక మీదనే అభినందనల వెల్లువ కురిసింది. నేతలంతా ఆయనను అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. పాదాభివందనం చేశారు. ఆ తర్వాత నూతన అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ తల్లికి వందనంతో మొదలు
ప్లీనరీ వేదిక మీదకు కేసీఆర్ రాగానే అధ్యక్ష హోదాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్మారక స్తూపానికి దండలు వేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కృషిచేసిన నేతల గురించి ప్రస్తావించి ఈ 20 ఏళ్ల కాలంలో చనిపోయినవారిని స్మరించుకున్నారు. వారి సంస్మరణార్థం రెండు నిమిషాల పాటు ప్లీనరీ మౌనం పాటించింది. ప్రొఫెసర్ జయశంకర్, నాయిని నర్సింహారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య, కావేటి సమ్మయ్య, చందూలాల్, ఎడ్మ కృష్ణారెడ్డి తదితర పలువులు నేతలకు సంతాపం తెలియజేశారు.
దళితబంధు లాగానే పేదలందరికీ
దళితబంధు పథకంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కేసీఆర్ ప్రస్తుతానికి వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నా భవిష్యత్తులో ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ తదితర అన్ని సెక్షన్లలోని పేదలకు కూడా అందజేస్తామని ప్లీనరీ వేదికగా హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్నారు. నవంబరు-డిసెంబరు మధ్యకాలంలో వంద శాతం అమలు పూర్తవుతుందని, ఆ తర్వాత నాలుగు మండలాల్లో, వచ్చే ఏడాది మార్చి నుంచి అన్ని నియోజకవర్గాల్లో అమలవుతుందని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో సందర్శిస్తానని, దళితబంధు గురించి అక్కడ మాట్లాడతానని పేర్కొన్నారు.
ఏపీలోనూ పార్టీ విస్తరణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రకరకాల అనుమానాలను వ్యక్తం చేసి శాపనార్ధాలు పెట్టినవారే ఇప్పుడు అబ్బుర పడుతున్నారని, ఏడేళ్లలో సాధించిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాందేడ్ జిల్లాలోని కొన్ని గ్రామాలు తెలంగాణ అభివృద్ధిని చూసి విలీనమవుతామంటూ అక్కడి ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారని తెలిపారు. ఇటీవల రాయచూర్ జిల్లాకు చెందిన ప్రజలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తెలంగాణ తరహా పథకాలను అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేశారని, లేదంటే తెలంగాణలో కలపాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీని అక్కడ పెట్టాల్సిందిగా తనను కోరుతున్నారని, విజ్ఞప్తులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఆ రాష్ట్రంలో పార్టీని విస్తరించడంపై ఆలోచిస్తామని సంకేతమిచ్చారు.
ఏపీలో నో పవర్.. తెలంగాణలో ఫుల్ పవర్
నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది రాజకీయ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారని, చివరకు ఆ రాష్ట్రం కంటే తెలంగాణనే ఎక్కువ అభివృద్ధి చెందిందంటూ కేసీఆర్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే 24 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామని, ఇప్పుడు దేశంలోనే అత్యధిక సగటు విద్యుత్ వినియోగం తెలంగాణలోనే ఉన్నదని ఉదహరించారు. తెలంగాణలో ఇప్పుడు కోతలు లేని నిరంతరాయ విద్యుత్ అందుతూ ఉంటే ఏపీలో మాత్రం విద్యుత్ కోతలు మొదలయ్యాయని అన్నారు. తలసరి ఆదాయం కూడా ఏపీలో రూ. 1.72 లక్షలు ఉంటే తెలంగాణలో రూ. 2.52 లక్షలు అని అన్నారు. ఆర్థిక వృద్ధి రేటు కూడా ఏపీకంటే తెలంగాణలోనే ఎక్కువని పేర్కన్నారు. ఏ రంగంలో చూసినా జాతీయ సగటుకంటే తెలంగాణ ముందు వరుసలోనే ఉన్నదని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌కు హెచ్చరిక
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి పోకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని, దళితుల సాధికారత కోసం ప్రవేశపెట్టిన దళితబంధు అమలుకు కూడా బ్రేక్ వేసిందని, దాని అధికారం ఎన్నికల వరకేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఇలాంటి ఆంక్షలు పెట్టడం మంచిది కాదన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలూ వాటివాటి విజయాలను, వైఖరిని ప్రజలకు వెల్లడిస్తాయని, బహిరంగసభలు కూడా పెట్టుకుంటాయని, ప్రజాస్వామ్యంలో లభించిన హక్కును ఈసీ కాలరాస్తున్నదన్నారు. ఈసీ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈసీ తన గౌరవాన్ని, స్వయం ప్రతిపత్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికల కమిషన్ ఆంక్షలను, పెత్తనాన్ని, పరిధి దాటి వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, ఆ తీరులోనే అది ప్రవర్తించాలని, దీన్ని ఒక హెచ్చరికగానే చెప్తున్నానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన మాటలను హుజూరాబాద్‌లోని ప్రజలు, ఓటర్లు కూడా వింటున్నారని అన్నారు.
పార్టీకి రూ.425 కోట్ల ఆస్తి
పార్టీ ఆవిర్భవించింది మొదలు ఇరవై ఏళ్ల ప్రయాణం తర్వాత ప్రస్తుతం రూ.425 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని కేసీఆర్ ఒకింత గర్వంగా ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులకు తెలియజేశారు. పార్టీ ఆర్థికంగా వృద్ధి చెందిందని, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశామని తెలిపారు. ప్రతీ నెలా రెండు కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా వస్తున్నదని, దాని తోనే రోజువారీ ఖర్చులు జరుగుతున్నాయన్నారు. పార్టీ సభ్యులకు కూడా ఇన్సూరెన్సు అవసరాలను ఈ ఆదాయం నుంచే సమకూరుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయని, కొన్ని త్వరలోనే ప్రారంభం కూడా అవుతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు వస్తాయన్నారు. ఢిల్లీలో సైతం పార్టీ ఆఫీసు నిర్మాణమవుతున్నదని, త్వరలోనే పార్టీ జెండా ఎగురుతుందన్నారు.
జాతీయ పార్టీలకు దళితబంధు సాధ్యం కాదు
దళితబంధు లాంటి భారీ పథకాన్ని జాతీయ పార్టీలు అమలుచేయడం సాధ్యం కాదని, కేవలం టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి మాత్రమే సాధ్యమని కేసీఆర్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 18 లక్షల మందికి మొత్తం రూ.1.80 లక్షల కోట్లు అవసరమవుతుందని, రానున్న ఏడేళ్లకు అయ్యే మొత్తం బడ్జెట్ రూ.23 లక్షలుగా అంచనా వేసుకుంటే ఈ పథకానికి చేసే ఖర్చు పెద్దగా లెక్కలోకే రాదన్నారు. 2028 సంవత్సరం నాటికి రాష్ట్ర బడ్జెట్ దాదాపు రూ. 7.70 లక్షల కోట్లుగా ఉంటుందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ధైర్యం లేదని, ఒకవేళ పెట్టినా ఒక్క రాష్ట్రానికే అమలుచేయడం సాధ్యం కాదని, దేశం మొత్తం అమలుచేసేంత ఆర్థిక వనరులు సమకూర్చుకునే సత్తా ఉండదని అన్నారు. ఆ రెండు పార్టీలు ప్రతీదానికి హైకమాండ్ అంటూ ఢిల్లీకి పరుగులు తీయాల్సి ఉంటుందని, కానీ టీఆర్ఎస్‌కు మాత్రం ప్రజలే హైకమాండ్ అని వ్యాఖ్యానించారు.