టూరిజం హబ్‌గా కాళేశ్వరం ప్రాజెక్టు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న ఆ శాఖ అభివృద్ధితో పాటు రాబడి, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా గతేడాది కుదేలైన ఈ రంగం ఇప్పుడిప్పుడే కుదుటబడుతోంది. కానీ సెకండ్ వేవ్ రూపంలో మళ్ళీ పర్యాటక శోభ మసకబారుతోంది. ఈ పరిస్థితిని బేరీజు వేసుకున్న ఆ శాఖ టూరిజం హబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేలా […]

Update: 2021-04-05 11:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న ఆ శాఖ అభివృద్ధితో పాటు రాబడి, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా గతేడాది కుదేలైన ఈ రంగం ఇప్పుడిప్పుడే కుదుటబడుతోంది. కానీ సెకండ్ వేవ్ రూపంలో మళ్ళీ పర్యాటక శోభ మసకబారుతోంది. ఈ పరిస్థితిని బేరీజు వేసుకున్న ఆ శాఖ టూరిజం హబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చే సందర్శకులకు బోట్ షికారు లాంటి సౌకర్యాలను కల్పించి ఆదాయాన్ని ఆర్జించే ప్రణాళికలను రెడీ చేసుకుంది. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిన రూ.350 కోట్లను పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య నిత్యం పెరుగుతుండడంతో వారిని ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో బోటింగ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రాజెక్టు పరిసరాల్లో పార్కులు, వాటర్ గేమ్స్ లాంటివి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 కోట్లు ఖర్చు అవుతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. బడ్జెట్ ప్రసంగంలో సైతం కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ అభివృద్ధి గురించి మంత్రి హరీష్ రావు ప్రస్తావన చేశారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ రకాల పనులపై టూరిజం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సందర్శకుల ద్వారా ఆదాయంతో పాటు యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నది అధికారుల అభిప్రాయం.

రాష్ట్రంలో పర్యాటక రంగంలో హైదరాబాద్‌కి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని చోట్లకూ పర్యాటకాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యానించారు. నగరంలోని ట్యాంక్‌బండ్, దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన 80 సీట్ల బోట్ తరహాలోనే కాళేశ్వరంలో బ్యాక్ వాటర్‌లోనూ బోట్ షికారు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరంతో పాటు మానేరు ఫ్రంట్ రివర్‌లోనూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం పర్యాటకానికి సంబంధించిన పూర్తి నివేదికలను టూరిజం అధికారులు ఇప్పటికే అందించినట్లు మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలుబెట్టనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News