BR Naidu: సానుకూల నిర్ణయమే తీసుకుంటాం.. హరీష్ రావుకు బీఆర్ నాయుడు హామీ

తెలంగాణ నేతలతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చైర్మన్‌ బీఆర్ నాయుడు వరుసగా భేటీ అవుతున్నారు.

Update: 2024-11-26 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నేతలతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చైర్మన్‌ బీఆర్ నాయుడు వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లను కలిసిన ఆయన.. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడిని శాలువాతో సత్కరించి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడికి తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అన్నారు. తిరుమల ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు.

తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. హరీష్ రావు విజ్ఞప్తికి నాయుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్‌లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.

Tags:    

Similar News