రైతు ఖాతాలో డబ్బులు మాయం.. మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా
దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామ SBI బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు, ఖాతాదారులు రాస్తారోకో చేశారు. అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని వారి అకౌంట్ల నుంచి వేల రూపాయలు కాజేస్తోన్న బ్యాంకు మేనేజర్‌పై చట్టం ప్రకారం.. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పోతంగల్ గ్రామానికి చెందిన పల్లె పండరీ అనే రైతు తండ్రి పేరుమీద స్థానిక ఎస్‌బీఐ బ్యాంకులో ఏడువేలు క్రాప్‌లోన్ పెండింగ్‌లో ఉంది. అయితే.. […]
దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామ SBI బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు, ఖాతాదారులు రాస్తారోకో చేశారు. అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని వారి అకౌంట్ల నుంచి వేల రూపాయలు కాజేస్తోన్న బ్యాంకు మేనేజర్‌పై చట్టం ప్రకారం.. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పోతంగల్ గ్రామానికి చెందిన పల్లె పండరీ అనే రైతు తండ్రి పేరుమీద స్థానిక ఎస్‌బీఐ బ్యాంకులో ఏడువేలు క్రాప్‌లోన్ పెండింగ్‌లో ఉంది. అయితే.. ఆ పెండింగ్ మొత్తం క్లియర్ చేస్తే కొత్త లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు పండరీకి చెప్పారు. దీంతో బ్యాంకుకు వెళ్లిన పండరీ.. వడ్డీతో కలిపి మొత్తం రూ.10 వేలు చెల్లించాడు.
అనంతరం మేనేజర్‌కు పండరీని తన క్యాబిన్‌లోకి పిలిపించుకొని, మీ తండ్రి పేరుమీద మరో రూ.26 వేలు డ్యూ ఉన్నాయని చెప్పాడు. లోన్ రాగానే రూ.26 వేలు కడతానంటే రూ.41 వేల లోన్ ఇప్పిస్తామని చెప్పి రైతును నమ్మించాడు. దీంతో మేనేజర్ చెప్పిన దానికి రైతు ఓకే చెప్పిన వెంటనే రూ.41 వేల క్రాప్ లోన్ డబ్బులు జమ అయ్యాయి. అనంతరం రైతుకు తెలియకుండానే ఖాతానుంచి రూ.26 వేలు పొతంగల్‌లో మినీ బ్యాంకు నడుపుతున్న మారుతీ అనే వ్యక్తి ఎకౌంట్లోకి బ్యాంక్ మేనేజర్ ట్రాన్ఫర్ చేశాడు. అనుమానం వచ్చిన రైతు మినీ స్టేట్‌మెంట్ తీసుకొని చూడగా తనకు తెలియకుండా రూ.26 వేలు మారుతీ అనే వ్యక్తి ఖాతాలోకి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆశ్చర్యపోయాడు.
వెంటనే రైతు మారుతీ వద్దకు వెళ్లి నా అకౌంట్లో నుంచి నీకు డబ్బులు ఎలా వచ్చాయని అడిగాడు. బ్యాంకు మేనేజన్ పంపి, అదేరోజు సాయంత్రం నా వద్దకు వచ్చి తీసుకున్నాడని స్పష్టం చేశాడు. ఇదే విషయం మేనేజర్‌ను సంప్రదించగా పొంతన లేని సమాధానం చెబుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నిరసనకు దిగారు. బ్యాంకు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అయినా.. మేనేజర్ స్పందించకపోవటంతో రాస్తారోకో చేశారు. అమాయక రైతులనే లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పుడుతున్న మేనేజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి, విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.