కరోనా ఎఫెక్ట్.. ఈసారి 'హల్వా' లేనట్లే.!

దిశ, తెలంగాణ బ్యూరో: ఏటా కేంద్ర బడ్జెట్‌ తయారీ సందర్భంగా ‘హల్వా’ కార్యక్రమం సంప్రదాయంగానే కొనసాగుతోంది. ఈ సంవత్సరం కరోనా కారణంగా ఆ సంప్రదాయం ఉండకపోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖవర్గాల సమాచారం. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటుకు ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీ. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ముద్రించే కార్యక్రమం ‘హల్వా’ తయారీతో మొదలవుతుంది. సుమారు వంద మంది సిబ్బంది ప్రింటింగ్ ప్రెస్‌లో పది రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా పగలూ, […]

Update: 2021-01-15 21:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏటా కేంద్ర బడ్జెట్‌ తయారీ సందర్భంగా ‘హల్వా’ కార్యక్రమం సంప్రదాయంగానే కొనసాగుతోంది. ఈ సంవత్సరం కరోనా కారణంగా ఆ సంప్రదాయం ఉండకపోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖవర్గాల సమాచారం. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటుకు ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీ. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ముద్రించే కార్యక్రమం ‘హల్వా’ తయారీతో మొదలవుతుంది. సుమారు వంద మంది సిబ్బంది ప్రింటింగ్ ప్రెస్‌లో పది రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా పగలూ, రేయి ప్రింటింగ్ ప్రెస్‌లోనే గడపాల్సి ఉంటుంది. అందుకే బడ్జెట్ కాపీల ముద్రణ ప్రారంభం సందర్భంగా ఆ వంద మందికీ అక్కడే ‘హల్వా’ తయారుచేయడం, కేంద్ర ఆర్థిక మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరవడం ఆనవాయితీ. హల్వా వండిన తర్వాత అందరూ అక్కడే దాని రుచి చూసి ఎవరి పనులలోకి వారు వెళ్లిపోతారు. ఆర్థిక శాఖ కార్యదర్శికి, ప్రత్యేకంగా అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రెస్‌లోకి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ ముగిసేంత వరకూ ఆ సిబ్బంది ప్రెస్‌లోనే గడపాల్సి ఉంటుంది. విషయాలు బైటకు పొక్కకుండా ఉండేందుకు హల్వా రుచితో వారికి ‘బందీ’ జీవితం ప్రారంభమవుతుంది.

బడ్జెట్‌పై కరోనా ఎఫెక్ట్?

ఈసారి బడ్జెట్ ఫిజికల్ కాపీలు ఉండవని ఆర్థిక శాఖవర్గాలు చెప్పడంతో ముద్రణ కార్యక్రమం రద్దయింది. ‘హల్వా’ కార్యక్రమం కూడా ఉండకపోవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్ ప్రతుల ముద్రణకు దాదాపు పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున జనవరి 20వ తేదీకే ‘హల్వా’ వంటకం మొదలవుతుంది. ఈసారి దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కంప్యూటర్లలో మాత్రమే బడ్జెట్ తయారవుతున్నందున ‘నార్త్ బ్లాక్’లోకి సందర్శకుల ఎంట్రీపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. నెల రోజుల ముందే ఆర్థిక శాఖ బ్లాక్‌లో ఎంట్రీ బందవుతుంది. ఈసారి కూడా ఆ ఆంక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అందువల్ల ప్రత్యేకంగా ‘హల్వా’ కార్యక్రమం ఉండకపోవచ్చని సమాచారం. బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కోసం ఒకే చోట వంద మంది పనిచేయాల్సి ఉంది. సోషల్ డిస్టెన్స్ లాంటివి అమలు చేయడానికి ఇబ్బందులు, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే మొత్తం ప్రక్రియకే కలిగే విఘాతం తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పది రోజుల పాటు వారికి బైట నుంచి భోజనం అందించడం, దాని ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఇలాంటివన్నింటి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డిజిటల్ విధానంతో ఈ భయాలన్నింటికీ చెక్ వేసినట్లయింది.

ఇక వందల కొద్దీ బస్తాలలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లు, గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘యాక్చువల్ బడ్జెట్ అకౌంట్స్’ లాంటి అంశాలకు సంబంధించిన లెక్కల పుస్తకాలు, శాఖలవారీగా చేసిన కేటాయింపులు, అయిన ఖర్చు లాంటి అంశాల డాక్యమెంట్లు… ఇవన్నీ పార్లమెంటుకు ప్రత్యేక భద్రతతో రావడం, లోడింగ్-అన్‌లోడింగ్ సందర్భంగా వందలాది మంది సిబ్బంది పాల్గొనడం, భద్రత కోసం జరిపే తనిఖీలు… ఇలాంటివన్నీ కూడా కరోనా వైరస్ సోకడానికి కారణమవుతాయన్నది ఆర్థిక శాఖ అధికారుల ఆందోళన.

ఈసారి ‘ఈ-కాపీ’లే!

ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా చేసే ప్రసంగానికి ఎంపీలందరికీ ఫిజికల్ కాపీలు అందుతాయి. ఈసారి డిజిటల్ ప్రతులు అందనున్నాయి. ఫిజికల్ కాపీల పంపిణీ ఉండదు. సంక్షిప్తంగా, స్థూలంగా కొన్ని పేజీలతో మాత్రమే బుక్‌లెట్ తరహాలో ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఆర్థిక మంత్రి ప్రసంగ పాఠాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతుల కోసం మాత్రం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ లింకును ఎంపీలకు అందజేయనున్నట్లు సమాచారం. బడ్జెట్ సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయనందున ప్రసంగం అయిపోయిన తర్వాత మాత్రమే వారు కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లలో చూసుకోడానికి వీలవుతుంది. బడ్జెట్ పుస్తకాలకు ఏటా ఒక్కో కలర్ కోడ్ ఉంటుంది. గతేడాది కాషాయం, ఆకుపచ్చ రంగుల బార్డర్ ఉంది. ఈసారి డిజిటల్ రూపంలో ఉంటున్నందున ఆ కలర్ కోడ్ ఉండదు. ఇక ‘వివరణాత్మక మెమొరాండం’ సాధారణంగా ఎప్పుడూ ముదురు పింక్ కలర్‌లో ఉంటుంది. ఈసారి అది ఉండకపోవచ్చు. ఆర్థిక సర్వే సాధారణంగా తెలుపు రంగు కవర్‌తో ఉంటుంది. డిజిటల్ రూపంలో ఉంటున్నందున అనేక సంప్రదాయ పద్ధతులకు ఈసారి చోటు లేదు.

Tags:    

Similar News