Ponzi Scam: గుజరాత్‌లో రూ. 6,000 కోట్ల పోంజీ స్కామ్.. పరారీలో సూత్రధారి
అధిక వడ్డీ రేట్లు ఇస్తామని మోసగించి పెద్ద సంఖ్యలో ప్రజలను మోసగించినట్టు పోలీసులు సందేహిస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా కేంద్రంగా రూ. 6,000 కోట్లకు పైగా సాగుతున్న పోంజీ కుంభకోణాన్ని సీఐడీ (క్రైమ్) అధికారులు ఛేదించారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న బీజేపీ కార్యకర్త పరారీలో ఉన్నట్టు సమాచారం. కనీసం ఏడు జిల్లాల్లో ఈ కుంభకోణం విస్తరించిందని, అధిక వడ్డీ రేట్లు ఇస్తామని మోసగించి పెద్ద సంఖ్యలో ప్రజలను మోసగించినట్టు పోలీసులు సందేహిస్తున్నారు. అనామక ఫిర్యాదుల ఆధారంగా సబర్‌కాంత, మరో ఆరు జిల్లాల్లోని బీజెడ్ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంపై సీఐడీ బృందాలు దాడి చేశాయి. రెండు బ్యాంకుల్లో రూ.175 కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. సీఐడీ దాడుల గురించి తెలుసుకున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భూపేంద్రసింగ్ పర్బత్‌సిన్హ్ జాలా, ఏజెంట్లు పరారైనట్టు పోలీసులు తెలిపారు. కంపెనీ సీఈఓకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నుంచి స్పందన కోసం పోలీసులు ప్రయత్నిచినప్పటికీ బదులు రాలేదు. భూపేంద్ర సింగ్ సబర్‌కాంత జిల్లా నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, చివర్లో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు బీజేపీ నుంచి పోటీకి భూపేంద్ర సింగ్ ప్రయత్నించగా, పార్టీ తిరస్కరించినట్టు సమాచారం.