అవి పట్టా భూములే..ఆలయానివే అనడానికి ఆధారాలేవి?
దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకు అసైన్డ్ భూములను ఆక్రమించారని మాజీ మంత్రి ఈటల, ఆయన అనుచరగణంపై అధికారులు లెక్క తేల్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం దేవరయంజాల్‌లోని సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన రూ. వేల కోట్ల విలువైన భూములను ఆయన, తన బినామీలతో కబ్జా చేశారంటూ ఓ మీడియా కథనం ద్వారా మరింత రాజకీయ వేడి రగులుకుంది. దీనిపైనా ప్రభుత్వం ఆగమేఘాల మీద దర్యాప్తునకు నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. […]
దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటి వరకు అసైన్డ్ భూములను ఆక్రమించారని మాజీ మంత్రి ఈటల, ఆయన అనుచరగణంపై అధికారులు లెక్క తేల్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం దేవరయంజాల్‌లోని సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన రూ. వేల కోట్ల విలువైన భూములను ఆయన, తన బినామీలతో కబ్జా చేశారంటూ ఓ మీడియా కథనం ద్వారా మరింత రాజకీయ వేడి రగులుకుంది. దీనిపైనా ప్రభుత్వం ఆగమేఘాల మీద దర్యాప్తునకు నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఐతే మాజీ మంత్రి ఈటల తనపై కక్ష సాధించేటప్పుడు ఇతరులను బలి చేయొద్దంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడి భూములపై గతంలో వేసిన కమిటీలు ఏం సిఫారసు చేశాయో గమనించాలన్నారు.
అలాగే ఈ రైతులు కూడా ఎంత కాలంగా సాగులో ఉన్నారో దర్యాప్తు చేయించాలన్నారు. ఐతే ప్రభుత్వం ఈటల మీదనే ఫోకస్ పెడుతూ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. ఆలయ భూముల్లో అనేక మంది గోడౌన్లు నిర్మించి కిరాయిలకు ఇచ్చారు. నగర విస్తరణ తర్వాత వ్యవసాయాన్ని బంద్ చేసి, ఇతర రంగాల కోసం సదరు భూములను వినియోగిస్తున్నారు. కొందరు అమ్మేశారు. మరికొందరు నేటికీ సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విచారణ కమిటీ ఏం తేల్చనుందోనని ఆసక్తి నెలకొంది. స్థానికులు మాత్రం ఆ హక్కుదారులంతా ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న వారేనంటున్నారు.
సదరు భూముల్లో హక్కులు లేని కొందరు మాత్రం అవి ఆలయానికి సంబంధించినవంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఐతే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మార్కెట్ రేటు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. దాంతో 100 ఎకరాల్లోని రైతులు డబ్బులు చెల్లించారు. ఈ సొమ్ము రూ.3 కోట్లను సీతారామ స్వామి ఆలయం ఖాతాలోనే జమ చేశారు. ఆ డబ్బుతోనే మొన్నటి వరకు ధూపదీప నైవేధ్యాలు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. అప్పట్లో రైతుల చెల్లించిన సొమ్ము మొత్తం రూ.5 కోట్లకు చేరింది. అలాగే గతంలో వేసిన కమిటీలు ప్రభుత్వానికి చేసిన సిఫారసులను అమలు చేసి ఉంటే ఈ వివాదం కొనసాగేది కాదని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుత మేడ్చల్జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్శ్రీసీతారామస్వామి ఆలయ భూముల వివాదంపై రైతు సమాఖ్య విజ్ఙప్తి మేరకు 2005లోనే విచారణాధికారిగా పనిచేసిన టీకే దివాన్సమగ్ర దర్యాప్తు చేశారు. నెల రోజుల గడువులో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. 2006 మే 19న రైతులు, కలెక్టర్, జాయింట్కలెక్టర్లతోనూ సమావేశమైనట్లు రిపోర్టులో పేర్కొన్నారు. దేవరయంజాల్‌లోని 1425.17 ఎకరాలకు సంబంధించిన యాజమాన్యపు హక్కులకు సంబంధించిన వివాదం, అనుమానాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లోనూ వివాదాస్పదంగానే ఉన్నాయి.
నివేదిక సారాంశమిదే..
– సర్వే నం.688 నుంచి 712, 716 వరకు 431.22 ఎకరాలు 1925-26 పహాణీల్లో సీతారామస్వామి ముత్తవల్లి రాముడి పుల్లయ్య అని, 1944 సేత్వార్ లో సీతారామస్వామి ఆర్.రామచంద్రయ్య అని, 1954-55 ఖాస్రాలో ప్రైవేటు వ్యక్తుల పేరిట మారాయి. ఆ తర్వాత 1999-2000 వరకు సీతారామస్వామి దేవస్థానంగా మార్చారు.
– పలు సర్వే నంబర్లలోని 369 ఎకరాల్లోనూ మొదట ఆలయం, ముత్తవల్లి, ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల పేరిట మారాయి.
– మరో 391 ఎకరాల్లోనూ సేత్వార్, ఖాస్రా పహాణీలు, ఆ తర్వాతి రెవెన్యూ రికార్డులకు మధ్య వ్యత్యాసం ఉంది.
– సర్వే నం.513, 524 లోని 9.17 ఎకరాలు సీతారామస్వామి ముత్తవల్లి పేరిట నుంచి పైపులైను, సర్కారీ ఎరోడ్రోమ్ గా మారింది.
– సర్వే నం.514 నుంచి 523 వరకు, 530, 737 లోని 131 ఎకరాల్లోనూ మొదట ప్రైవేటు వ్యక్తుల పేరిట మారింది. ఆ తర్వాత సర్కారీ ఎరోడ్రోమ్ గా రాశారు.
– సర్వే నం.641, 664, 665, 666, 667, 683, 685లో 83 ఎకరాలు సీతారామస్వామి ముత్తవల్లి రాముడి పుల్లయ్య నుంచి కొందరు ప్రైవేటు వ్యక్తులకు మారింది. ఆ తర్వాత ఖారీజ్ ఖాతా(సర్ ప్లస్ ల్యాండ్)గా మార్చేశారు.
– 658లోని 7.39 ఎకరాలను పొరంబోకు కుంటగా, సర్కారీగా, మళ్లీ కుంట శిఖంగా మారింది.
సిఫారసులివే..
విచారణ చేసిన కమిటీ కొన్ని భూములను ప్రభుత్వం, దేవాదాయ శాఖ సెటిల్ చేయాలని సూచించింది. మరికొన్ని భూముల్లో దేవాదాయ శాఖ, ప్రైవేటు వ్యక్తులు సివిల్ లేదా రెవెన్యూ కోర్టుల్లో తేల్చుకోవాలని సిఫారసు చేశారు. చాలా ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. రైతులకు, దేవాదాయ సంస్థకు ఒకటే సమయంలో న్యాయం చేయడం కష్టం. రెగ్యులరైజేషన్ కూడా కష్టం. అందుకే కొంత కాంప్రమైజ్ కు రావాలని కమిటీ సిఫారసులో పేర్కొంది. వన్ టైం సెటిల్మెంట్ కింద ఏదైనా ధరను నిర్ణయించాలి. ప్రభుత్వమే రెండు ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి సీసీఎల్ఏ ఎ.రఘోత్తమరావు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.