న్యూ ఇయర్‌కు న్యూ రూల్స్.. వారికే పర్మిషన్స్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు రెడీ అయ్యారు....

Update: 2024-12-28 02:29 GMT

దిశ, శేరిలింగంపల్లి: నూతన సంవత్సర వేడుకలకు సమయం ఆసన్నమైంది. న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైపోతోంది. ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. హోటల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అయిపోతున్నాయి. యూత్‌కు నచ్చేలా, స్నేహితులతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఎవరు ఏం చేయాలనుకున్నా కండిషన్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు పెట్టారు.

రూల్స్ ఇవే..

త్రీస్టార్‌ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు రాత్రి 1గంట వరకు నిర్వహించే వేడుకలకు 15 రోజుల ముందుగానే అనుమతులు ఇచ్చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు, మద్యం సేవించినవారు పార్టీ తర్వాత డ్రైవింగ్‌ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్‌లు, రిసార్ట్స్ యాజమాన్యాలదే అని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు పబ్‌లలో డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వినియోగంపై దృష్టిపెట్టాలని, అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అలాగే ఎలాంటి శాంతిభద్రతలకు ముప్పు తలెత్తకుండా వేడుకలు జరిగేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు.

పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్..

కొత్త సంవత్సరం వేడుకల్లో యూత్ మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నగరంలో ఏదో ఒకచోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీదనే.. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా, కశ్మీర్, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగర శివారుల్లోనూ లోకల్ మేడ్‌గా తయారు చేస్తూ.. ఈ ఇయర్ ఎండ్‌లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారట. అలాంటి వారు ఈ న్యూ ఇయర్ మంచి అవకాశంగా భావిస్తున్నారు.

మహా నగరంపై ఫోకస్..

ఇదివరకు చిన్నాచితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్‌లో ఇప్పుడు తరచుగా డ్రగ్స్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఒకప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు లోకల్ ముఠాలే డ్రగ్స్ తయారు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత... హైదరాబాద్ మూడో స్థానంలో ఉందంటే అతిశయోక్తికాదు. పబ్బులు, బార్లు, రిసార్టులు, ఫామ్ హౌసుల్లో చాలాకాలంగా ఈదందా సాగుతుండగా ఈ మధ్య ఈ కల్బర్ అన్నిచోట్లకు పాకింది. బర్త్ డే వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు ఏదో ఒకరకమైన డ్రగ్స్ లేకపోతే నామోషీగా ఫీలవుతున్నారు కొందరు. ఒక్కమాటలో చెప్పాలంటే డ్రగ్స్ వాడకం అనేది ఇప్పుడు నయా ట్రెండ్ అంటున్నారు యూత్.

మత్తుకు బానిసలు..

గతంలో సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ మత్తుమందులు ఇప్పుడు సామాన్యుల చెంతకు కూడా చేరాయి. చివరికి స్కూలు విద్యార్థులకు సైతం దొరుకుతున్నాయంటే ఈ డ్రగ్స్ ముఠాలు ఏస్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. చిత్రసీమను, ఐటీ ఎంప్లాయిస్‌ను టార్గెట్‌గా చేసుకుని రంగంలోకి దిగిన డ్రగ్స్ ముఠాలు సామాన్యులను సైతం తమ ఉచ్చులోకి లాగుతున్నాయి. ఇదివరకు నైజీరియా, ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యంత ఖరీదైన మత్తుపదార్థాలు ఇప్పుడు లోకల్‌గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్, పంజాబ్ నుంచి ఖరీదైన డ్రగ్స్ హైదరాబాద్ వచ్చి చేరుతున్నాయి. వీటి సరఫరా కోసం పటిష్టమైన నెట్‌వర్క్‌ను సరఫరాదారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా కొత్తకొత్త పద్ధతుల్లో ఈ డ్రగ్స్ దందాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమవుతున్నారు.


Similar News