రూ.200 కోట్ల స్థలం హాంఫట్: అప్పుడు మాదని.. ఇప్పుడు కాదని..!

హైదరాబాద్‌ గౌలిపురాలో 7 ఎకరాల స్థలం కబ్జాపై ఆందోళనలు పెరుగుతున్నాయి...

Update: 2024-12-28 02:12 GMT

దిశ, సిటీబ్యూరో: ఒకపక్క చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, పార్కులు, ఫుట్‌పాత్‌ల కబ్జాలను అరికట్టడంతో పాటు వాటిని పరిరక్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కూడా ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల భూమిని పరిరక్షించింది. ఇలాంటి తరుణంలో జీహెచ్ఎంసీకి చెందిన 7 ఎకరాలకుపైగా భూమి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వ్యక్తుల పాలైంది. ఈ విషయంపై ఆరేకటిక సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితంలేకుండపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

4.2 ఎకరాల భూమి..

హైదరాబాద్‌ గౌలిపురాలో నిజాం కాలం నుంచి కబేళా నిర్వహణ ఉంది. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ 4.2 ఎకరాల స్థలంలోనే కబేళా నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల 2003లో హైకోర్టు ఆదేశాలతో గౌలిపురా కబేళా మూతపడింది. అప్పటి నుంచి ఈస్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కొంత మంది కన్నేశారు. కబ్జాదారులకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు వంతపాడడంతో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొట్టేశారు. గౌలిపురలోని 4.2 ఎకరాల భూమిని 2010లో అప్పటి హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రైవేటు వ్యక్తులకు మ్యుటేషన్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. తర్వాత హైదరాబాద్‌ కలెక్టర్‌గా వచ్చిన గుల్జార్‌ గౌలిపురా భూమి మ్యుటేషన్‌ను రద్దు చేసి ప్రభుత్వానికి చెందినదిగా ప్రకటించారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం నిర్ణయంతో అక్కడ రూ.7 కోట్లతో రాంకీ సంస్థల ఆధ్వర్యంలో మోడ్రన్ కబేళాను నిర్మించారు.

కౌంటర్ దాఖలు లేదు.. అఫిడవిట్ మాత్రం..

గౌలిపురలో 4.2 ఎకరాల స్థలం విషయంలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై కనీసం కౌంటర్ దాఖలు కూడా చేయడంలేదని ఆరేకటిక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ స్థలం తమది కాదని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులను అడిగితే తమకేం తెలియదని బుకాయిస్తున్నారు. అంతేకాదు సంతకం పెట్టిన అప్పటి కమిషనర్ సైతం తనకు తెలియకుండా దాఖలు చేశారని చెప్పడం శోచనీయం.

3 ఎకరాల స్థలం ఊసేది?..

గౌలిపుర కబేళాకు సంబంధించిన 4.2 ఎకరాల స్థలంతో పాటు 1961లో మరో 3 ఎకరాలను ఎంసీహెచ్ అధికారులు కొనుగోలు చేశారు. కానీ ఈ మూడు ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. గౌలిపుర స్థలంపై పోరాడుతున్న సీపీఐ(ఎం) నాయకులు ఎం.శ్రీనివాస్ 3 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను బయటకు తీశారు.

హైడ్రాకు ఫిర్యాదు చేసినా..

గౌలిపుర 4.2 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు దక్కించుకోవడంతో పాటు మరో 3 ఎకరాల స్థలం గురించి ఆరేకటిక సంఘం ఆధ్వర్యంలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకైతే దీనికి హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? దీనిపై కమిషనర్ రంగనాథ్ దృష్టిసారించలేదా? అనేది చూడాలి. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకుని స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని, అఫిడవిట్ విషయంలో కుట్రలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు.


Similar News