ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. జర భద్రం సుమీ!

దిశ, ఫీచర్స్ : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్థిరమైన పెరుగుదల కారణంగా వాహనదారులు 'ఎలక్ట్రిక్ వెహికిల్స్'.. Latest Telugu News..

Update: 2022-03-31 00:30 GMT

దిశ, ఫీచర్స్ : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్థిరమైన పెరుగుదల కారణంగా వాహనదారులు 'ఎలక్ట్రిక్ వెహికిల్స్'పై ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణహిత వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తయారీదారులు, వినియోగదారులకు ప్రత్యేక సబ్సిడీ, పన్ను రాయితీలు ప్రకటించాయి. కానీ ఇండియాలో ఈ-బైక్స్ కాలిపోతున్న ఘటనలు, ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడులో ఇటీవల జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అగ్నిప్రమాదాలు EV వాడకంపై ఆందోళన పెంచుతున్నాయి. ఈ ఇన్సిడెంట్స్‌పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. సమగ్ర విచారణ కోసం స్వతంత్ర బృందాన్ని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ-వెహికిల్స్ ఎందుకు కాలిపోతున్నాయి? ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.


ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో మంటలు చెలరేగుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువయ్యాయి. ఇటీవల తమిళనాడులో ఈ-బైక్​తగలబడి ఇద్దరు మరణించిన ఘటన మరవకముందే తిరువళ్లూరులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో కాలిపోయింది. స్కూటర్‌తో పాటు ఇంట్లోని ఇతర విలువైన సామగ్రి అగ్నికి ఆహుతి కాగా.. దాదాపు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే EV ఫైర్ యాక్సిడెంట్స్‌ విషయంలో ఇండియన్ మేకర్స్‌ను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే అమెరికా, చైనా నుంచి వచ్చిన అనేక నివేదికలు టెస్లా వాహనాల్లో అగ్నిప్రమాదాలను హైలెట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లు సహా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయిన సంఘటనలు 25 వరకు సంభవించాయి. అయినా ఇప్పటి వరకు కచ్చితమైన ప్రమాద కారణాలు కనుగొనలేదు. నిజానికి ఇటువంటి విషాద సంఘటనలకు లిథియం-అయాన్ బ్యాటరీల్లోని 'థర్మల్ రన్‌ అవే' కారణమవుతుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. 'థర్మల్ రన్‌అవే' ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు కలిగించినప్పుడు వాటిని ఆర్పడం కూడా అంతే కష్టమని వారు పేర్కొన్నారు.


థర్మల్ రన్‌అవే :

ఇదొక ఎక్సో థర్మల్ ప్రక్రియ. సెల్‌లో అంతర్గతంగా జరిగే రసాయన ప్రతిచర్యల వల్ల బ్యాటరీలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మరింత వేడి ఉత్పన్నమవడంతో బ్యాటరీలో మంటలు ఏర్పడతాయి. ముఖ్యంగా వేసవిలో వాతావరణం 40 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఈ సందర్భాల్లో అది బ్యాటరీ మంటలను ప్రేరేపించే అవకాశముంటుంది. కానీ థర్మల్ రన్‌అవే మాత్రమే ఇందుకు కారణం కాదనేది మరో వాదన. చాలావరకు ఆటోమేకర్స్ చైనా నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకుంటూ మార్కెట్‌కు సబ్ స్టాండర్డ్ ఉత్పత్తులను అందిస్తున్నందున బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సంఘటనలను అరికట్టాలంటే భారతీయ వాతావరణం, ఉష్ణోగ్రత, రహదారి పరిస్థితులకు అనువైన బ్యాటరీలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే దాదాపు 80 శాతం బ్యాటరీలు ఉత్పత్తి అవుతున్నాయి.


మరిన్ని కారణాలు :

ఈ బ్యాటరీలను వందల సార్లు చార్జింగ్ పెట్టుకోవచ్చు. బరువు కూడా తక్కువే. మిగతా బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే. అయితే ఇవి పూర్తిగా సురక్షితమని చెప్పలేం. సాంకేతికంగా బ్యాటరీలో నాణ్యత లోపించడం, BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) వంటి ప్రత్యేక కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, ఓవర్‌ చార్జింగ్ & డిశ్చార్జింగ్, వేడెక్కడం, సెల్ ఇంబ్యాలెన్స్ తదితర అంశాలు కూడా అగ్ని ప్రమాదాలను ప్రేరేపిస్తాయి. ఎలక్ట్రోలైట్ ద్రావణం కూడా పేలుడుకు కారణం కావచ్చు.


ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి?

* సరైన భద్రతా ప్రమాణాలు పాటించే కంపెనీల నుంచే బైక్స్ కొనుగోలు చేయాలి.

* తయారీదారు అందించిన లేదా సిఫార్సు చేసిన చార్జర్స్‌తోనే వాహనాన్ని చార్జ్ చేయాలి

* తెగిపోయిన వైర్లతో కూడిన చార్జర్‌తో బ్యాటరీని చార్జ్ చేయకపోవడమే ఉత్తమం.

* ఎక్స్‌టెన్షన్ బాక్స్ ఉపయోగించి చార్జ్ చేయకూడదు.

* చార్జింగ్ పెట్టే చోట స్మోక్ డిటెక్టర్ ఉండేలా చూసుకోవాలి.

* రాత్రిపూట చార్జింగ్ ఆన్‌చేసి అలానే వదిలేయకూడదు.

* నీటిలో తడిసిన బ్యాటరీని మెకానిక్‌తో చెక్ చేయించిన తర్వాతే ఉపయోగించాలి.

* ఎండలో ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ గంటలు ఈవీని బయట పార్క్ చేయొద్దు.

* చార్జింగ్ విధానాన్ని అర్థం చేసుకునేందుకు నిపుణుల సాయం తీసుకోవాలి.

* బ్యాటరీ పనితనాన్ని ట్రాక్ చేసేందుకు EV తయారీదారు అందించిన యాప్‌ను ఉపయోగించాలి.

* EVని చార్జ్ చేసేందుకు సరైన సాకెట్స్, ప్లగ్స్ ఉపయోగించాలి.

* పాడైన లిథియం అయాన్ బ్యాటరీలను ఇంట్లో స్టోర్ చేయడం మంచిదికాదు.

* కంపెనీలు సూచించిన విధంగా బ్యాటరీలను డిస్పోజల్ చేయాలి.

* మార్కెట్లలో లభించే సెకండ్ హ్యాండ్ బ్యాటరీలను కొనుగోలు చేయొద్దు.

* సూర్యకాంతి నేరుగా తాకే ప్రదేశంలో బ్యాటరీలను ఉంచవద్దు.

కాగా సంప్రదాయ వాహనాల కంటే ఈ-వెహికల్స్ తక్కువ సురక్షితమైనవిగా పేర్కొనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్వీడిష్ నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..