టైగర్స్ @ 42..
తెలంగాణలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిరంతరం పర్యవేక్షణ, ఆహార లభ్యతకు చొరవ తీసుకోవడం, వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేయకుండా నిఘాతో పాటు వాటిని తొలగిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిరంతరం పర్యవేక్షణ, ఆహార లభ్యతకు చొరవ తీసుకోవడం, వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేయకుండా నిఘాతో పాటు వాటిని తొలగిస్తున్నారు. అంతేకాకుండా పులుల సంఖ్యకు అనుగుణంగా జింకలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో నీటి లభ్యతకు ప్రత్యేక చర్యలు చేపడుతుండటంతో 42 పులులకు చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అమ్రాబాద్ ఫారెస్టులో 34, ఉమ్మడి ఆదిలాబాద్ లో 8 పులులు ఉన్నాయని తెలిపారు. మరోవైపు పులుల పై డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు టైగర్ సెల్ ఏర్పాటు చేసే యోచనలో అటవీశాఖ ఉంది. అంతే కాకుండా టైగర్ల కోసం కారిడార్ ల అభివృద్ధికి ప్రణాళికలు సైతం ప్రభుత్వం రూపొందిస్తుంది.
పులుల సంరక్షణ పై సర్కార్ ఫోకస్..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖ పులుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే టైగర్స్ ను ట్రాక్ చేయడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుస దాడుల నేపథ్యంలో పులి సంచరిస్తున్న అటవీ ప్రాంతాల పై వాటిని ట్రాక్ చేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో రాష్ట్రంలో ఏటా పులుల సంఖ్య పెరుగుతోంది. ఇతర టైగర్ జోన్ల నుంచి టైగర్లు తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్టీసీ ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫోర్త్ ప్లేస్ లో భాగంగా 1086 సీసీ కెమెరాల ట్రాప్ ద్వారా అమ్రాబాద్, అచ్చంపేట డివిజన్లలో 10 రేంజ్ లు, 903 ప్రదేశాలు, నాలుగు బ్లాక్లులుగా విభజన చేసి పులుల గణన చేసినట్లు తెలిసింది. 0.8 కిలోమీటర్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో సీసీ పుటేజీలతో పరిశీలించి జంతువుల లెక్కింపు కొనసాగినట్లు సమాచారం. అదే విధంగా 187 చిరుత పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అమ్రాబాద్ అభయారణ్యంలో దాదాపుగా 34 పులులు ఉన్నాయి. ఇందులో ఆడపులులు 15, మగ పులులు 11, పులి పిల్లలు 8 ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 వరకు పులులు ఉన్నట్లు సమాచారం. పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎటు వైపు వెళ్తున్నాయి..? వాటి కదలికలను అటవీశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణకు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సమీపంగా ఉండటంతో అక్కడి అటవీ ప్రాంతాల నుంచి టైగర్లు ఉత్తర తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వరం, కడంబా టైగర్ జోన్ల నుంచి టైగర్లు వస్తున్నట్లు గుర్తించారు. దక్షిణ తెలంగాణకు నల్లమల అటవీ ప్రాంతం ఆనుకొని ఉండటంతో అక్కడి నుంచి ఎక్కువగా పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్టులో కొల్లాపూర్ రేంజ్ లు ఉండగా, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వరంగల్ జోన్‌లోని ఏటూరు నాగారం, ములుగు, లక్నవరం, కొత్తగూడెం జోన్‌లోని కిన్నెసాని, పోచారం అడవుల్లో కంటే.. నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఏటీఆర్ వన్యప్రాణులు, పులులకు సేఫ్ జోన్‌గా మారింది.
టైగర్స్ సంచారాన్ని ట్రాక్ చేయడానికి డ్రోన్ కెమెరాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల వరుస దాడుల నేపథ్యంలో పులి సంచారాన్ని ట్రాక్ చేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి పులి అడుగు జాడలు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పులి బారినపడకుండా కొంత కాలం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పొలం పనులకు వెళ్లి రావాలని ఫారెస్టు అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కాలం ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. వెంకటాపురం, మంగపేట, తాడ్వాయి మండలాల్లో సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ పరిసరాల్లో పులి అడుగు జాడలు కనిపించాయి. మంగపేట, తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్న పులి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అడవుల్లోకి ప్రవేశించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. పులుల స్థిర నివాసం కోసం టైగర్ల కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కవ్వాల్, కాగజ్ నగర్ లో ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పులుల సంఖ్యకు అనుగుణంగా జింకల ఏర్పాటు : మంత్రి సురేఖ
రాష్ట్రంలో పులుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వేటగాళ్లు, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఉచ్చులను ఏర్పాటు చేయకుండా, బిగించిన ఉచ్చుల తొలగింపునకు నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. పులులకు నీటి లభ్యత ఎల్లవేళలా ఉండేవిధంగా సోలార్ ఆధారిత బోర్ వెల్స్ ఏర్పాటు చేశాం. పులుల సంఖ్యను అనుసరించి వాటి ఆహారానికి అవసరమైన నిష్పత్తిలో జింకలను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా పులుల కదలికలను నిరంతరం గమనించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఒక్కో పులి జాడను నిరంతరం పర్యవేక్షించేందుకు గాను నాలుగు ట్రాకర్ల ఏర్పాటు చేశాం. అంతేగాకుండా పులుల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం.