Ponguleti Srinivasa Reddy: ‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం
చారిత్రాత్మకమైన భూ భారతి(Telangana Bhu Bharati) చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు.
దిశ, వెబ్‌డెస్క్: చారిత్రాత్మకమైన భూ భారతి(Telangana Bhu Bharati) చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజానీకానికి మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని, ఈ చట్టంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం -2020 వల్ల తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కోన్నారు. భూ సమస్యలేని గ్రామం తెలంగాణలో లేదు. గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. గత ప్రభుత్వంలో కొందరి గుప్పిట్లోనే కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు అందించడానికి మా ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. గ్రామాలలో రెవెన్యూ పాలనను చూడడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని ఇందుకు సంబంధించిన కసరత్తు కొలిక్కివచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలి, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష. ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా మా ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సామన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయాలన్నారు.