400 కుటుంబాల గ్రామ బహిష్కరణ.. హుకుం జారీ చేసిన వీడీసీ

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో గ్రామాభివృద్ది కమిటీల పెత్తనం రోజురోజుకు పెరిగిపోతోంది. వీడీసీలు చెప్పినట్లు వినని వారిపై.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని

Update: 2022-04-11 14:21 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో గ్రామాభివృద్ది కమిటీల పెత్తనం రోజురోజుకు పెరిగిపోతోంది. వీడీసీలు చెప్పినట్లు వినని వారిపై.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ బహిష్కరణ, జరిమానాలు విధించటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా మామడ మండలం న్యూ సాంగ్వీ గ్రామ పంచాయతీలోని వడ్డెర కాలనీలో ఉన్న సుమారు 400 వడ్డెర కులస్తుల కుటుంబాలపై వీడీసీ గ్రామ బహిష్కరణ విధించింది. గత 80 ఏళ్లుగా న్యూ సాంగ్వీలో సుమారు 400 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు చెప్పినట్టు వినడం లేదని.. వీడీసీ తమను గ్రామ బహిష్కరణ విధించిందని వారు తెలిపారు.


అంతేకాకుండా రోడ్డుకు అవతలి వైపు నుంచి ఇవతలి వైపు దాటిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరికి ఎవరైనా సహకరిస్తే వారికి రూ.5 వేలు జరిమానా.. ఎవరైనా చూసి చెప్పినట్లైతే వారికి రూ.వెయ్యి నజరానా ఇస్తామని ప్రకటించారు. కిరాణా సరుకులు, రేషన్ సరుకులు ఏవీ కూడా ఇవ్వవద్దని హుకుం జారీ చేశారు. వీరికి సంబంధించిన మేకలు, గొర్రెలు, బర్రెలు గ్రామంలోకి రానివ్వొద్దని ఆంక్షలు విధించారు. దీంతో తమకు న్యాయం చేయాలని ఆయా కుటుంబాలు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులను ఆశ్రయించారు. వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్, జిల్లా, మండల వడ్డెర సంఘం నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు.

అనంతరం బహిష్కరణకు గురైన కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారికి న్యాయం చేయాలని.. బాధ్యులైన వీడీసీ పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తహసీల్దారు, ఎస్సై, అదనపు కలెక్టర్, ఎస్పీలను కలిసి వినతి పత్రం అందజేశారు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుని.. సమస్యను పరిష్కారిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్ పేర్కొన్నారు. తహసీల్దార్ గ్రామాన్ని సందర్శించి.. వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పారు.

Tags:    

Similar News