థర్డ్ పార్టీకి 'టెట్' నిర్వహణ.. ఏజెన్సీ కోసం ప్రయత్నాలు
దిశ, తెలంగాణ బ్యూరో: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ద్వారా ‘టెట్’ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ద్వారా 'టెట్' పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినా.. ఈసారి ఈ బాధ్యతను థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి అభ్యర్థుల జాబితాను రూపొందించడం (ప్రీ-ఎగ్జామ్) మొదలు.. పరీక్షల నిర్వహణ, ఫలితాల (పోస్ట్ ఎగ్జామ్) వరకు ఆ ఏజెన్సీకే బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. పరీక్షల నిర్వహణతోపాటు డాటా రూపకల్పనలో తగిన అనుభవం ఉన్న ఏజెన్సీని ఎంపిక చేయడంపై అధికారులు దృష్టిసారించారు. జూన్ 12న టెట్ పరీక్ష జరగనున్నందున ఈ నెల చివరికల్లా ఏజెన్సీని ఖరారు చేసే చాన్స్ ఉంది. అందుకు అవసరమైన ప్రక్రియ మొదలైంది.
అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో..
టెట్ పరీక్షకు సుమారు 4 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచాన వేశారు. కానీ దాదాపు 6.29 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. పరిమిత సిబ్బందితో పరీక్షలను నిర్వహించడం, ఏర్పాట్లు చేయడం కష్టసాధ్యమన్న అభిప్రాయంతో నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీకి అప్పజెప్పాలని భావిస్తున్నట్టు తెలిసింది. గతంలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను గ్లోబరీనా సంస్థకు అప్పజెప్పడం వివాదాస్పదమైంది. మార్కుల లిస్టులో జరిగిన అవకతవకలతో ఇంటర్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మళ్లీ టెట్ నిర్వహణ విషయంలో ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చేందుకు స్కూల్ఎడ్యుకేషన్ విభాగం ఆలోచిస్తుండడం సరికొత్త ఆందోళనలకు దారితీసింది. ఈ సారి బీఈడీ అభ్యర్థులకు సైతం పేపర్ 1కు అవకాశం లభించడంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే రోజు పేపర్ 1, 2 పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలైలో నిర్వహించిన టెట్‌తో పోల్చుకుంటే ఈసారి దాదాపు రెండున్నర లక్షల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రీ, పోస్ట్ఎగ్జామ్ దశలను నిర్వహించే బాధ్యతను ఏజెన్సీకి అప్పజెప్పాలన్నది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్భావన.
అభ్యర్తుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో డాటా బేస్‌గా తయారుచేయడం, నామినల్ రోల్స్ జాబితా తయారీ, హాల్ టికెట్ల రూపకల్పన, పరీక్షల కోసం ఓఎంఆర్ షీట్‌ల సరఫరా, వ్యాల్యుయేషన్ సందర్భంగా వాటిని స్కానింగ్ చేయడం, ఫలితాలను విశ్లేషించి మార్కుల జాబితాను అనుగుణమైన తీరులో క్రోడీకరించడం, ఆన్‌లైన్ పద్ధతిలో రిజల్ట్‌ను ప్రకటించడానికి వీలుగా వెబ్‌సైట్ నిర్వహణ.. ఇలా వేర్వేరు దశల్లో మొత్తం ప్రక్రియను ఆ ఏజెన్సీకి అప్పగించాలని అనుకుంటున్నట్టు సమాచారం. గ్లోబరీనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం తగిన అనుభవం ఉన్న ఏజెన్సీకే బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నది. సాంకేతిక సమస్యలకు తావు లేకుండా ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోనూ అనుభవం ఉంటే మంచినదే అభిప్రాయం ఆ శాఖ అధికారుల నుంచి వ్యక్తమవుతున్నది.