ఫైర్ ఎన్ఓసీ లపై సర్వే చేయండి.. హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశం

దిశ, సిటీ బ్యూరో: సికింద్రాబాద్ బోయిగూడ లోని స్క్రాప్ గోదాంలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం latest telugu news..

Update: 2022-03-23 15:41 GMT

దిశ, సిటీ బ్యూరో: సికింద్రాబాద్ బోయిగూడ లోని స్క్రాప్ గోదాంలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఉన్న ఫైర్ సేఫ్టీ బృందాలతో మొత్తం మహానగరంలోని కమర్షియల్ సంస్థలు, స్క్రాప్ గోదాంల ఫైర్ ఎన్ ఓసీలపై సర్వే నిర్వహించి, సమగ్ర నివేదికను సమర్పించాలని హోంమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. బోయిగూడ ఘటన నేపథ్యంలో ఉదయం ఆయన ఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం మధ్యాహ్నం పోలీస్, ఫైర్, జీహెచ్ఎంసీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, ఎన్ ఓసీలు వంటి అంశాలపై డీజీపీ ఆఫీస్ లో తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. గోదాం లో నివాసముంటున్న కార్మికులకు అక్కడ కనీస వసతులను సైతం కల్పించటంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కనీసం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, వీలైనంత తక్కువ జరిగేలా మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఘటన తనను చాలా బాధించిందని, నిద్రలోనే 11 మంది కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసి పోవడం తనను చాలా కలచివేసిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఉదయాన్నే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని వెల్లడించారు. మృతి చెందిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి ఆయన ఇప్పటికే రూ. 5లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించిన విషయాన్ని మహమూద్ అలీ గుర్తు చేశారు.

అంతేగాక, ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు వీలైనంత త్వరగా అప్పగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News