AP News : చేనేత రంగాన్ని ఆదుకోండి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

దిశ, ఏపీ బ్యూరో : చేనేత రంగానికి ప్రత్యేక ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించి సంక్షోభం..latest telugu news

Update: 2022-04-01 09:30 GMT

దిశ, ఏపీ బ్యూరో : చేనేత రంగానికి ప్రత్యేక ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం చేనేత‌ల అంశంపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల కుటుంబాలు చేనేత రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నాయ‌ని.. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల్లో 87 శాతం గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయ‌ని వెల్లడించారు.

ఈ రంగంలో పని చేస్తున్న వారిలో 72 శాతం మహిళ‌లే. చేనేత కార్మికులలో 68 శాతం వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారున్నారని విజయసాయిరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్ వల్ల చేనేత రంగం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది.. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోయింది అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. అమ్మకాలు జరగకపోవడంతో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి.. ఫ‌లితంగా ఉత్పత్తి నిలిచిపోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులపై దీని ప్రభావం తీవ్రంగా పడింద‌ని చెప్పుకొచ్చారు. చేసేందుకు పనిలేక కుటుంబాలను పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో చేనేత కార్మికులు ఉన్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చేనేత రంగం సంక్షోభంలో పడటానికి గల కారణాలను వెల్లడించారు. మార్చి 2020 నుంచి జనవరి 2022 మధ్యలో పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగిపోయాయ‌ని, నూలు అందుబాటు ధరలకు లభ్యం కాకపోవడంతో చేనేత ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. అలాగే కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన రెండేళ్ల వ్యవధిలో పేద, బడుగు వర్గాలకు చెందిన చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించలేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత రంగం పునరుజ్జీవనం కోసం తక్షణం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్తి, నూలు వంటి ముడి సరుకులను సబ్సిడీపై అందించడంతోపాటు చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News