మంత్రి కేటీఆర్ హెచ్చరికలు బేఖాతర్.. మాకు అడ్డెవరంటున్న సర్పంచ్‌ల భర్తలు

దిశ, కామారెడ్డి రూరల్ : మేము అధికార పార్టీ నాయకులం.. మా మాటే చెల్లుబాటు అవుతుంది..latest telugu news

Update: 2022-03-28 11:30 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : మేము అధికార పార్టీ నాయకులం.. మా మాటే చెల్లుబాటు అవుతుంది. మా భార్యలకు పదవి ఉంటే వాళ్లే ఉండాలా.. వాళ్ల స్థానంలో మేము రాకూడదా.. వస్తే ఎవరు అడ్డు చెప్తారు. అనే రీతిలో అధికార టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో కార్యాలయాల్లో తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే సోమవారం కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారు. అయితే మార్కెట్ కమిటీ కార్యాలయంలో తీర్మానం చేసే సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యార లక్ష్మితో పాటు ఆమె భర్త సాయిలు సైతం సమావేశంలో అధికారికంగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.


మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్ పాల్గొనాల్సిన అధికారిక సమావేశంలో చైర్మన్ భర్త సైతం పాల్గొని తీర్మానం కాపీని డైరెక్టర్లతో పాటు చైర్మన్ కు అందజేశారు. అలాగే కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు మాత్రమే పాల్గొనాలి. కానీ మహిళా ఎంపీటీసీలు, సర్పంచుల స్థానంలో వారి భర్తలు సమావేశంలో పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం గమనార్హం. ఇస్రోజీవాడి సర్పంచ్ కొత్త మమత స్థానంలో ఆమె భర్త కొత్త రాజు, శాబ్దిపూర్ సర్పంచ్ పస్తం యాదమ్మ స్థానంలో ఆమె భర్త పరశురాం, చిన్నమల్లారెడ్డి సర్పంచ్ కృష్ణా జిగారి రత్నాబాయి స్థానంలో ఆమె భర్త ఆనంద్ రావు, చిన్న మల్లారెడ్డి ఎంపీటీసీ కమ్మరి అనంతలక్ష్మి స్థానంలో ఆమె భర్త కమ్మరి శ్రీనివాస్, క్యాసంపల్లి ఎంపీటీసీ కోరంద భాగ్యలక్ష్మి స్థానంలో ఆమె భర్త రాజిరెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలని చేసిన తీర్మానం కాపీని ఎంపీపీ పిప్పిరి అంజనేయులుకు అందజేశారు.


ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దళితబంధు అవగాహన సమావేశంలో కూడా కామారెడ్డి జడ్పీటీసీ రమాదేవి స్థానంలో ఆమె భర్త లక్ష్మారెడ్డి ఏకంగా వేదికపైనే ఆశీనులయ్యారు. ఇలా ఒకటి రెండు అని కాకుండా ప్రతి సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు సమావేశాల్లో పాల్గొని మాకు అడ్డు ఎవరు అనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిన అధికారులు మాత్రం చూసిచూడనట్టు వదిలేస్తూ అధికార పార్టీ నాయకులకు భయపడి కేవలం ప్రేక్షక పాత్ర పోషించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ అధికారిక సమావేశాల్లో సతుల స్థానం లో పతులు పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం విదితమే. కానీ ఆయన మాటలను బేఖాతరు చేస్తూ అధికారిక కార్యక్రమాల్లో పతులు పాల్గొంటూ ఎవరు చెప్తే మాకేంటి అంటూ నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. ఇకైనైనా జిల్లా అధికారులు స్పందించి సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులు తప్ప వారి భర్తలు పాల్గొనకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు అధికార పార్టీ అధిష్టానం సైతం నాయకుల స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే మహిళలు రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..