ఉక్రెయిన్ శరణార్థుల కోసం నోబెల్ మెడల్ వేలం.. రష్యన్ జర్నలిస్ట్ దాతృత్వం
దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనసాగిస్తున్న దండయాత్రను రష్యన్ పౌరులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనసాగిస్తున్న దండయాత్రను రష్యన్ పౌరులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు తమ వంతు సాయమందిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ శరణార్థుల కోసం నిధులు సేకరించేందుకు రష్యాకు చెందిన జర్నలిస్ట్ డిమిత్రి మురటోవ్ తన నోబెల్ శాంతి పతకాన్ని వేలం వేసేందుకు డిసైడ్ అయ్యాడు.
1993లో 'నోవాయా గెజిటా' వార్తాపత్రిక స్థాపించిన మురటోవ్.. రెండు దశాబ్దాలుగా ఆ పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రష్యాలోని స్వతంత్ర మీడియా సంస్థల్లో ఇదీ ఒకటి కాగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండించిన రష్యన్ పత్రిక కూడా ఇదే. ఈ క్రమంలోనే 2021లో తనను వరించిన ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పతకాన్ని ఉక్రెనియన్ శరణార్థులకు నిధుల సేకరణ కోసం విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నాడు. వార్తా సైట్ రాప్లర్ సహ-వ్యవస్థాపకురాలు, ఫిలిప్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలిసి సంయుక్తంగా ఈ అవార్డ్ గెలుచుకున్న మురటోవ్.. గతేడాది తన నోబెల్ బహుమతిని 'ప్రజల వాక్ స్వాతంత్ర్య హక్కును కాపాడుతూ మరణించిన' వారికి అంకితం చేశాడు.
ఈ మేరకు 'నోవాయా గెజిటా' ద్వారా వచ్చే నిధులతో పాటు 2021 నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని విరాళంగా ఇస్తున్నాను. ఇప్పటికే 10 మిలియన్‌కు పైగా శరణార్థులు ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ అవార్డును వేలం వేయాలని వేలం సంస్థలను కోరుతున్నాను' అని తన మనసులోని మాటల్ని తెలియజేశాడు.