శేరి VS పద్మ: భగ్గుమంటోన్న వర్గపోరు.. మెదక్‌లో ఆసక్తికర రాజకీయం
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతున్నది. ఎవరికి వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతున్నది. ఎవరికి వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రూపులు కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య ఆరోపణల పర్యం తీవ్రతరమైంది. రానున్న ఎన్నికల్లో తమ నేత అభ్యర్థిత్వాన్నే సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నట్లు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం ఎవరికి పర్యటనలు చేసుకుంటున్నారు. ఎవరి మీడియా సమావేశాలు వారివే. ఎవరి వద్దకు వెళితే ఏమిటోనని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జుట్ట పీక్కుంటున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిల మధ్య మెదక్అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొనసాగుతున్న వ్యవహారం ఇది. తన వ్యవసాయ క్షేత్రంలో శేరి ఐదురోజుల పాటు అత్యంత వైభవంగా సహస్ర చండీయాగం నిర్వహిస్తే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మినహా పద్మాదేవెందర్‌రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్యులెవరు హాజరుకాలేదు. దీంతో శేరిని సీఎం కేసీఆర్ఎప్పుడో పక్కన పెట్టారని అందుకే ఎవరూ రాలేదని పద్మ వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శేరి సుభాష్రెడ్డే పార్టీ నుంచి పోటీ చేయనున్నారని పద్మ రాజకీయాలు ఇక సాగవని అతని వర్గీయులు చెప్పుకుంటున్నారు. గ్రూపుల మధ్య ఆరోపణలు తీవ్రతరమైనా అధిష్టానం మాత్రం చూస్తూ ఉండిపోతున్నది.
చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు
ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు స్థానికులే కావడంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకోవడంతోనే విభేదాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే సుభాష్‌రెడ్డి సీఎం రాజకీయ కార్యదర్శిగా ప్రగతిభవన్ వ్యవహారాలతోనే బిజీగా ఉంటుంటారు. పద్మ మాత్రం నియోజకవర్గంలో పర్యటనలు, ఇతర కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటుంటారు. ఇలా ఉండగా శేరికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక అప్పటినుంచి శేరి కూడా నియోజకవర్గంపై దృష్టి సారించారు. మెదక్ వచ్చి అధికారులతో సమీక్షలు జరిపి, మీడియా సమావేశాలు పెట్టి వెళుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు ఇప్పించడం, చెక్కులను పంపిణీ చేయడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఇలా కొంతకాలంగా ఇద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొన్నది. ఎవరి వైపు వెళితే ఏం జరుగుతుందోనని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే బాసులని ఎమ్మెల్సీలు, ఎంపీలు జోక్యం చేసుకోవద్దని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్స్వయంగా హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ శేరి తనను డ్యామేజ్ చేయడానికే మెదక్‌లో మకాం వేసి రాజకీయం చేస్తున్నారని ఆమె తన వర్గీల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకున్నారట.
'శేరి'ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టారా?
ఎమ్మెల్యీ శేరి సుభాష్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో పక్కన పెట్టారని పద్మ వర్గీయులు విస్త్రతంగా ప్రచారం చేసుకుంటున్నారు. రోజూ నియోజకవర్గంలో పర్యటిస్తూ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని శేరిపై పద్మ సీఎంకు కన్నీళ్లు పెట్టుకుని ఫిర్యాదు చేశారని, దీంతో ఆగ్రహించిన సీఎం కేసీఆర్ సుభాష్‌రెడ్డిని పక్కన పెట్టారని పద్మ సన్నిహితులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా సుభాష్‌రెడ్డి ప్రగతిభవన్‌కు దూరం అయ్యారని, సీఎం ఎక్కడికి వెళ్లినా పక్కనే ఉండే ఆయన ఈ మధ్య కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. సుభాష్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఐదురోజుల పాటు అత్యంత వైభవంగా 150 మంది పండితులతో సహస్ర చండీయాగం నిర్వహిస్తే సీఎం కుటుంబం సభ్యులు, మంత్రులు, పార్టీ ముఖ్యులు ఎందుకు రాలేకపోయారంటున్నారు. స్పీకర్ పోచారం మినహా జిల్లా మంత్రి హరీష్‌రావు కూడా రాలేదు. పద్మ కూడా అటువైపు వెళ్లలేదు. అయితే, చివరిరోజు సీఎం కేసీఆర్ సతీమణి యాగానికి వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె కూడా రాకపోవడంతో పద్మ వర్గీయులు తమ ప్రచారానికి మరింత పదునుపెట్టారు. ముఖ్యమంత్రి దగ్గర సుభాష్‌రెడ్డి మంచి అభిప్రాయం కోల్పోవడంతోనే పక్కన పెట్టారని, ఇక పద్మ జోలికి ఆయన రాడని ఆమె సన్నిహితులు సంతోషంగా చెప్పుకుంటున్నారు.
'పద్మ'కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కష్టమే?
ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి వర్గం కూడా ఎమ్మెల్యే పద్మపై ఆరోపణలు చేస్తున్నది. పద్మ, అమె భర్త దేవేందర్‌రెడ్డి పేర్లు అంటనే సీఎం కేసీఆర్‌కు నచ్చదని, వచ్చే ఎన్నికల్లో శేరి సుభాష్‌రెడ్డి మెదక్ నుంచి పోటీ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. శేరికి టిక్కెట్ ఎప్పుడో ఖాయం అయిందంటున్నారు. నియోజకవర్గంలో తిరిగి కేడర్‌ను పెంచుకోవాలని సీఎం సూచించడంతోనే రోజువారీగా ఆయన పర్యటిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇక, ఈసారి ఆమెకు అవకాశం ఇవ్వడం కష్టమే అని పనిగట్టకుని ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో మెదక్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సుభాష్‌రెడ్డి కేసీఆర్ముందుంచుతున్నారని, కోనాపూర్ సొసైటీ అక్రమాలు వెలుగు చూడడం కూడా ఇందులో భాగమేనని శేరి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. తనపై నమ్మకం ఉండడంతోనే తన వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా నియమించుకున్నారని, అదనంగా ఎమ్మెల్సీని చేశారని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదీ ఏమైనా రాబోయే రోజులు శేరి సుభాష్రెడ్డివేనని ఆయనతో సన్నిహితంగా ఉండే కొందరు ఇప్పటి నుంచే ఛాలెంజ్‌లు వేసుకుంటున్నట్లు సమాచారం.
ఇద్దరి మధ్య నలుగుతున్న అధికారులు
ఎమ్మెల్యే, ఎమ్మల్సీ రాజకీయాల మధ్య అధికారులు, పార్టీ నాయకులు నలిగిపోతున్నారు. జిల్లాస్థాయి అధికారులకు రోజువారీగా ఇద్దరూ ఫోన్లు చేస్తున్నారు. సమీక్ష, సమావేశాలు ఉంటే ఇద్దరికీ చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఈ క్రమంలో ఒకరు కాదన్నది, మరొకరు అవునడం అధికారులకు ఇబ్బందిగా మారుతున్నది. జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తే ఒకరిని కలిసి మరొకరిని కలవకపోతే ఇబ్బందని ఇద్దరినీ కలిసి వెళుతున్నారు. ఈ ఇద్దరి రాజకీయ వైరం ఇంకా ఎంతదూరం పోనున్నదో చూడాలి.