దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు అక్కడ భిన్నంగా జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేయడం సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. 11 మంది సభ్యులు ఉన్న ఈ మండలంలో ఏడుగురు సభ్యులు అయ్యారు. ఎంపీపీ రాకున్నప్పటికీ కోరం ఉన్నందున ఉపాధ్యక్షురాలు మునిగాల విజయ లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల తేదీలను వెంటనే ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం మాని వెంటనే ధాన్యం సేకరించాలని కోరుతూ మండల సమావేశం తీర్మాణించింది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే చొప్పదండిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ తీర్మానం చేయడం సంచలనం కల్గిస్తోంది.
మండలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు నలుగురు సభ్యులు మాత్రమే ఉండడంతో బీజేపీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం గమనార్హం. అలాగే చొప్పదండి మార్కెట్ యార్డుకు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని ఇతర అవసరాలకు కేటాయించవద్దని, రాష్ట్ర రహదారి పక్కన మరో 35 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని కోరారు.