Rajat Kumar: క్లౌడ్ బరస్ట్, పోలవరంపై ఐఏఎస్ రజత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్
Rajat Kumar IAS Comments On Cloudburst, Polavaram Project| పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల భారీగా పంట పొలాలు నీట మునిగిపోతాయని, అలాగే చారిత్రాత్మక ప్రాంతాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు
దిశ, వెబ్‌డెస్క్ : Rajat Kumar IAS Comments On Cloudburst, Polavaram Project| పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల భారీగా పంట పొలాలు నీట మునిగిపోతాయని, అలాగే చారిత్రాత్మక ప్రాంతాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రజత్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తయితే లక్షల ఎకరాల సాగు భూమి నీటి పాలవుతుందని అలాగే భద్రాచలం, పర్ణశాల వంటి చారిత్రాత్మక ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటక్ విషయంలో అధ్యాయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు నివేదికలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే తమ అభ్యంతరాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని స్పష్టం చేశారు.
వారే ఆ ఖర్చులు భరిస్తారు
భారీ వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ. 20 నుంచి 25 కోట్ల నష్టం జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు పంప్ హౌస్ మరమ్మతులకు రూ. 300 కోట్లు ఖర్చు అవుతుందనడంలో వాస్తవం లేదని అన్నారు. రిపేర్‌కు రూ. 20 నుంచి 25 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా జరిగిన నష్టాన్ని నిర్వహాణ సంస్థలే భరిస్తాయని పేర్కొన్నారు. మరో 45 రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌస్‌ల మరమ్మతుల పనులు పూర్తయి తిరిగి సెప్టెంబర్ లో పని చేయడం ప్రారంభం అవుతుందని చెప్పారు. కడెం, కాళేశ్వరం వద్ద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారణ చేస్తోందని వివరించారు.
క్లౌడ్ బరస్ట్ టెక్నికల్ పదం కాదు
సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యల నేపథ్యంలో రజత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు జరిగిందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాలు, కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడిందని అన్నారు. 100 ఎళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షాలు కురిశాయని గుర్తు చేశారు. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టిన కారణంగా భారీ ప్రమాదం తప్పిందని అన్నారు. ఇదిలా ఉంటే పోలవరం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రజత్ కుమార్ చేసిన కామెంట్స్ మరింత వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ కొనసాగుతుండగా పోలవరంపై తాజా ఇష్యూ ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అనే చర్చ మొదలైంది.