కాంగ్రెస్ మంత్రులు, నాయకులను మూసీ నదిలో పాతరేస్తాం.. ఎంపీ ఈటెల రాజేందర్
గత ఐదు నెలలుగా పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
దిశ, చైతన్యపురి : గత ఐదు నెలలుగా పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీజేపీ మూసీ నిద్రలో భాగంగా ఆదివారం ఉదయం కొత్తపేట, చైతన్యపురి డివిజన్ లలోని న్యూ మారుతినగర్ సత్యనగర్, ఫణిగిరి కాలనీలలో మూసి బాధితులను కలిసి మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొట్టమొదట హైడ్రా పేరిట చెరువుల పక్కన కట్టుకున్న నివాసాలకు ఎలాంటి నోటీసులు లేకుండా కాళ్ళు మొక్కుతామని చెప్పినా వినకుండా కూల్చారని ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదల ఇల్లు కూలగొట్టి వారి బ్రతుకుల్లో మట్టికొడుతున్నారనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. గత ఐదు నెలలుగా అనేక చెరువులు తిరిగినానని 70 సంవత్సరాల నుండి చెరువుల పక్కన ఇల్లు కట్టుకొని కూలీ పనులు చేసుకునే వారి జోలికి వస్తుంటే ముందుగా మేమే ముందుండి పేదలకు అండగా ఉన్నామని తెలిపారు.
తర్వాత యావత్తు ప్రజానీకం కదిలి రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తోకముడిచిందన్నారు. తదుపరి మూసీ ప్రక్షాళన అని తెచ్చిండు. ఒక లక్షా యాభై వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి మళ్ళీ 146 కోట్లతో డీపీఆర్ రిపోర్ట్ తయారు చేయిస్తున్నామని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నల్గొండ జిల్లాకు వెళ్లి హైదరాబాద్ బస్తీ వాసులు అడ్డుకోవడం వలన మూసీ ప్రక్షాళన ఆలస్యం అవుతుందని చెబుతున్నాడన్నారు. చైతన్యపురి డివిజన్ లోని ఫణిగిరి కాలనీ, మారుతీ నగర్ ప్రజలు ప్రతి ఇంటికి నలభై వేలు ఖర్చు చేసుకుని కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. కిరాయి దారులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఫణిగిరి కాలనీలో గీత అనే నిండు గర్భిణి డెలివరీ మూడు రోజులు సమయం ఉండగా అధికారులు ఖాళీ చేయమన్నారు. నేను ఇంట్లోనే డెలివరీ అవుతాను ఒక నెల సమయం ఇవ్వాలని కోరిన వినిపించుకోకుండా గెంటివేశారు. నీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాదని బెదిరించినట్లు తెలిపారు. పక్కనే ఉండే సంధ్యారాణి ఖాళీ చేసి వెళుతుంటే కాలనీవాసులు అడ్డుకొని ఎవరు ఏమి చేయరని మీరు ఇక్కడే ఉండాలని మళ్లీ తిరిగి ఇంట్లోకి పంపించారు. ఈ ప్రజలందరికీ బీజేపీ అండగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పగానే వీళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు.
బీజేపీ నాయకుల పై బుల్డోజర్ ఎక్కిస్తామని చెబితే మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కట్టినప్పుడు భూములు కోల్పోయిన రైతులకు ఏమి ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు ఏమిచ్చారని నిలదీశారు. మూసీకి అటువైపు ఇటువైపు భూములు తీసుకోకుండా కేవలం చైతన్యపురి, కొత్తపేట, రామంతపూర్ లలో మాత్రమే భూములు తీసుకొని ఆదాని, అంబానీ లాంటి వరకు కట్టబెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. చిలుక పలుకులు పలికే మంత్రులారా అహంకారపూరిత ముఖ్యమంత్రితో మీరు ప్రజల మధ్యలో తిరగకుండా ఉంటారని తెలిపారు. బుల్డోజర్లు బీజేపీ నాయకుల పై కాకుండా కాంగ్రెస్ నాయకులపైకి వస్తాయని తద్వారా మూసీ నదిలో మిమ్మల్ని పాతరేస్తారని హెచ్చరించారు. జీడిమెట్ల నుంచి వచ్చే వ్యర్ధ రసాయనాలు, డ్రైనేజీ నీరు, వరద నీరు రాకుండా ఆపే ప్రయత్నం చేసి కరకట్ట నిర్మాణం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కార్పొరేటర్లు రంగ నరసింహ గుప్తా, నాయకోటి పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.