సర్వే మాకు అక్కర్లేదు.. 150 ఇండ్లలో 40 ఇండ్లు నిరాకరణ..

సర్వేకు సకల జనులు సహకరించాలి, ప్రభుత్వ పథకాల కోసం సర్వే చేస్తున్నాం, వివరాలను గోప్యంగా ఉంచుతాం, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2024-11-17 02:21 GMT

దిశ, సిటీబ్యూరో : సర్వేకు సకల జనులు సహకరించాలి, ప్రభుత్వ పథకాల కోసం సర్వే చేస్తున్నాం, వివరాలను గోప్యంగా ఉంచుతాం, అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ గ్రేటర్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సర్వేకు సుమారు 30 శాతం ప్రజలు సహకరించడంలేదు. సర్వేచేయడానికి ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇండ్లను కేటాయించగా 40 ఇండ్ల యజమానులు సర్వేకు సహకరించడం లేదు. అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరంలేదని ప్రభుత్వమే చెప్పింది కదా, నేను పేదవాన్ని ప్రభుత్వం నాకు ఏమైనా ఇస్తుందా ? జర ఇప్పించండి అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని పలువురు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. చేసేదేమిలేక సదరు ఇంటి యజమాని ఫొన్ నెంబర్ తీసుకుని ‘నాట్ విల్లింగ్’ అని రాసుకుంటున్నామని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ కులాలకు సంబంధించిన సబ్ కాస్ట్ చెప్పడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. సబ్ కాస్ట్ చెప్పక పోతే సర్వేకు అర్థం లేదని పలువురు రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నో ఎంట్రీ..

గేటెడ్ కమ్యూనిటీ, పెద్దపెద్ద టవర్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాల్లోకి ఎన్యుమరేటర్లను రానివ్వడంలేదని తెలిసింది. కొంత మంది స్టిక్కర్లు కూడా చేయనివ్వడం లేదని సమాచారం. ఐటీ ఉద్యోగులు వివరాలు చెప్పడానికి ముందుకు రావడం లేదని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. నార్త్ ఇండియన్స్, ఏపీకి చెందిన వారు వివరాలు చెప్పడం లేదని, తామిక్కడకాదులే అంటూ దాటవేస్తున్నారని తెలిసింది. బహుళ అంతస్తుల భవనాలకు చెందిన యజమానులు తమకేం లేదని తప్పుడు సమాధానాలు చెబుతున్నారని ఎన్యురేటర్లు చెబుతున్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వివరాలు చెబుతున్నారని సమాచారం. మాదాపూర్, మియాపూర్, చందానగర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మూసాపేట్, ఆల్వాల్, తెల్లాపూర్, శివారు మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. ఇక చార్మినార్ జోన్ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సర్వే వివరాలను నమోదు చేయడానికి జోన్ల వారీగా ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. 20వ తేది నుంచి డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభంకానుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ టీచర్ల ఆలస్యం.. ప్రైవేటు టీచర్ల నిరాసక్తి..

సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లలో ఇతర శాఖలకు సంబంధించిన ఉద్యోగులు 3,778 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ టీచర్లు ఎక్కువగా ఉన్నారు. వీరంతా ఉదయం స్కూళ్లకు వెళ్లి మధ్యాహ్నాం తర్వాత సర్వే చేస్తున్నారు. ఆ సమయంలో భార్యాభర్తలు ఉద్యోగులైతే వివరాలు చెప్పడానికి అందుబాటులో ఉండటం లేదు. దీంతోపాటు ప్రైవేటు టీచర్లు మాత్రం సర్వే చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో సర్వే పూర్తిస్థాయిలో జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే సర్వే పై ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు లేకపోవడంతోనే ప్రజలు సహకరించడంలేదని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, నోడల్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.


Similar News