ఇప్పటికైనా పద్ధతి మార్చుకో..రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

మూసీ సుందరీకరణను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు...

Update: 2024-11-16 17:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ సుందరీకరణను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, వాటికి అడ్డంగా నిలబడి చావడానికైనా సిద్ధమేనని, కానీ వెనక్కి తగ్గబోమని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. లక్ష బుల్డోజర్లు పెట్టినా ఒక్క ఇల్లు కూలగొట్టనివ్వమన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ‘మూసీ ప్రక్షాళన చేయండి.. కానీ పేదల ఇండ్లు కూలగొట్టకండి’ అనే నినాదంతో బీజేపీ శనివారం బస్తీ నిద్ర చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట తులసీరాంనగర్ లో ఆంబోజి శంకరమ్మ ఇంట్లో భోజనం చేసి అక్కడే నిద్రించారు. కాగా అంతకుముందు అక్కడికి చేరుకున్న కేంద్ర మంత్రికి ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రజలు, బాధితులతో కలిసి బస్తీలోని ఇంటింటికీ తిరిగి వారి బాధలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కాగా స్థానిక బస్తీ ప్రజలు, బాధితులు తమ ఇండ్లు తమకు కావలని, తమ ఇండ్లను కూలగొట్టడానికి వీల్లేదని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పటి వరకు ప్రజలకు, అధికారులకు ఎవరికీ తెలియదని, కానీ సర్కార్ మాత్రం అడ్డుగోలుగా నిరుపేదల ఇండ్లను కూల్చుతోందని ఘాటు విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రెడ్డి ప్రశ్నించారు.

మూసీపై తాము నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించినట్లు గుర్తుచేశారు. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు బుల్డోజర్ తో ఇల్లు కూలుస్తారో అనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బస్తీ నిద్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఇండ్లు కూల్చాలన్నది ఏమాత్రం న్యాయం కాదని, రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉందో, ఎంత డబ్బుందో తమకు తెలియదని, మూసీ బ్యూటిఫికేషన్‌కు రూ.లక్షన్నర కరోట్లు సోనియా గాంధీ ఇస్తుందా? లేక రాహుల్ గాంధీ ఇస్తాడా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి అవసరమైతే ఇండ్లలో పనిచేసే పేదలు సైతం మూసీ బ్యూటిఫికేషన్‌కు నిధులిస్తారని, కానీ ఇండ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రజలకు రక్షణగా ఉండాలని, కానీ రేవంత్ రెడ్డి.. అలా కాకుండా బుల్డోజర్ పెట్టి ఇండ్లు కూలుస్తా.., మిమ్మల్ని తొక్కిస్తా.., పేగులు మెడలేసుకుంటా.., కండ్లు పీకి గోలీలాడుతా అని మాట్లాడవచ్చా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వం ఇండ్లు కూల్చకుండా రిటైనింగ్ వాల్ కట్టి ప్రక్షాళన చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.


Similar News