పదేళ్ల పవర్ ఫార్ములాపై కసరత్తు.. రంగంలోకి పీసీసీ చీఫ్
పార్టీలో నేతల మధ్య వ్యక్తిగత విభేదాలకు చెక్ పెట్టేందుకు స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు...
దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీలో నేతల మధ్య వ్యక్తిగత విభేదాలకు చెక్ పెట్టేందుకు స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. నేతల మధ్య సమన్వయం చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటిస్తూ ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయనున్నారు. దీని వలన పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా, లీడర్ల మధ్య గ్యాప్‌ను తొలగించవచ్చని పీసీసీ చీఫ్భావిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా పీసీసీ కార్యవర్గం అన్ని జిల్లాల డీసీసీలతో మాట్లాడింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి జిల్లాల టూర్లను ఫిక్స్ చేశారు. కరీంనగర్ నుంచి మొదలు పెడతామని పీసీసీ చీఫ్ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది సంబురాలలో భాగస్వామ్యం అవుతూనే, పార్టీ రివ్యూలు కూడా చేయనున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్మహేష్కుమార్ గౌడ్ తన షెడ్యూల్‌ను తయారు చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే కారణమా..?
పార్టీ ఏజెండాను అమలు చేయడం నేతల బాధ్యత అని పీసీసీ చీఫ్కంటిన్యూగా వివరిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన నొక్కి చెప్తున్నారు. కానీ ఇప్పటికీ నేతల మధ్య కో ఆర్డినేషన్ లేక ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాల అమలు విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని కార్యకర్తలు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో సీరియస్ గా సమన్వయం మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. కో ఆర్డినేషన్ లేకపోవడంతో గ్రూప్ వివాదాలు పెరిగిపోతున్నాయని, దీన్ని కాంట్రోల్ చేయకపోతే స్థానిక సంస్థల్లో నష్టం జరుగుతుందని పార్టీ భావిస్తున్నది. దీంతోనే జిల్లాల్లో పర్యటిస్తూ మహేష్‌కుమార్ గౌడ్ పార్టీ సిస్టమ్ ను చక్కదిద్దాలని భావిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్ జిల్లాలోనూ ఇంటర్నల్ ఫైట్స్ ఏర్పడ్డాయి. వీటికి చెక్ పెట్టాలని పార్టీ ఆలోచిస్తున్నది.
పదేళ్ల పవర్ టార్గెట్..?
కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు పవర్‌లో ఉంచాలని నేతలు భావిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యచరణను పీసీసీ తయారు చేస్తున్నది. సంక్షేమం, డెవలప్ మెంట్ తో పాటు కాంగ్రెస్ అనుసరించిన ప్రజాస్వామ్య విధానాలను ప్రజల ముందు ఉంచనున్నారు. దీని వలన పార్టీకి మైలేజ్ పెరిగి, ప్రభుత్వం స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తున్నది. దీనిలో భాగంగా తొలుత త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుపొందాలని భావిస్తున్నారు. ఇందుకోసం పది నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, స్కీమ్ లు వంటివన్నీ జనాల్లోకి విస్త్రృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 26 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన ఏడాది సంబురాల్లో కార్యకర్తలను సంపూర్ణంగా భాగస్వామ్యం చేయనున్నది. ఈ మేరకు జిల్లాల వారీగా పార్టీ కొత్త కమిటీలను కూడా నియమించనున్నది.