8 రోజులు.. ఐదు ఉమ్మడి జిల్లాలు: బీసీ కమిషన్ పర్యటన
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో మలివిడత బహిరంగ విచారణను ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు చేపట్టనుంది..
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో మలివిడత బహిరంగ విచారణను ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు చేపట్టనుంది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ పరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా ప్రజలు, కుల సంఘాలనుండి విజ్ఞాపనలను, వినతులు, సలహాలు, సూచనలను కమిషన్ స్వీకరించనుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో బహిరంగ విచారణలను చేపట్టాలని కమిషన్ నిర్ణయించింది. అయితే, ఇప్పటికే తొలి విడతగా అక్టోబరు 28 నుండి నవంబరు 2 వ తేదీ వరకు ఆదిలాబాదు, నిజామాబాదు, సంగారెడ్డి, కరీంనగర్, హన్మకొండలో కమిషన్ పర్యటించింది. తాజాగా ఈ నెల 18 నుండి 26వ తేదీ వరకు మిగతా ఐదు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. ఈనెల 18న నల్గొండ, 19న ఖమ్మం, 21న రంగారెడ్డి, 22న మహబూబ్ నగర్, 23న హైదరాబాద్ జిల్లా కలెక్టరు కార్యాలయాలలో బహిరంగ విచారణలు జరగనున్నాయి. జిల్లా కేంద్రాలలో నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరు కాలేనివారు ఈ నెల 25, 26 తేదీలలో ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరగనున్న బహిరంగ విచారణకు హాజరు కావచ్చుని తెలిపారు. అంతే కాకుండా, బహిరంగ విచారణలకు వ్యక్తిగతంగా హాజరు కాలేనివారు పోస్టు ద్వారా తమ విజ్ఞాపనలను ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయానికి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేరేవిధంగా పంపవచ్చుని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీసీ కమిషన్ విజ్ఝప్తి చేసింది.