జలమండలి హెడ్ ఆఫీస్ నుంచే వాటర్ ఫీజబిలిటీ ధ్రువ పత్రాలు

కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజబిలిటీ ధ్రువ పత్రాన్ని జారీ చేసే ప్రక్రియను జలమండలి ఇక సులభతరం చేసింది.

Update: 2024-11-17 01:50 GMT

దిశ, సిటీ బ్యూరో: కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజబిలిటీ ధ్రువ పత్రాన్ని జారీ చేసే ప్రక్రియను జలమండలి ఇక సులభతరం చేసింది. గ్రేటర్ పరిధిలో నూతన భవనం నిర్మాణ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీతో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రం సమర్పించాలి. గతంలో సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఆ ప్రక్రియలో జాప్యం జరిగేది. వాటకి చెక్ పెడుతూ.. ధ్రువపత్రాల జారీని జల మండలి కేంద్ర కార్యాలయం నుంచే చేపట్టేలా మార్పులు చేశారు.

ధ్రువ పత్రాల జారీకి కమిటీ..

వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాలు జారీ చేయడానికి జలమండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ధ్రువపత్రాల కోసం వినియోగదారులు ముందుగా తమ దగ్గరలోని సీజీఎంలకు దరఖాస్తులు సమర్పించాలి. వారు 6 రోజుల పాటు వాటిని పరిశీలించి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్న కమిటీకి పంపిస్తారు. సర్టిఫికెట్ల కోసం వినియోగదారులు 30 రోజుల్లోగా నదగు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం నిర్దేశిత 5 రోజుల్లో రెవెన్యూ విభాగ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) ధ్రువపత్రాలను జారీ చేస్తారు. దీంతో భవనాలు నిర్మించుకునే వారికి పని, ధ్రుపత్రాల విషయంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ కమిటీ ద్వారా ఈ నెలలో ఇప్పటికే 19 వాటర్ ఫీజబిలిటీ ధ్రువ పత్రాలను జారీ చేశారు.


Similar News