విడుదలకు అన్నీ సిద్ధం చేయండి.. అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని

ఈ ఏడాది రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద 26,778 నీటి వనరుల్లో సుమారు 88.52 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలు.

Update: 2022-06-27 15:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద 26,778 నీటి వనరుల్లో సుమారు 88.52 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్టు పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ లోని మత్స్య భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలని, అదే విధంగా చేప పిల్లల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే చేసే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పలు జిల్లాల్లో పిపిపి పద్ధతిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. గడువు ముగిసిన మత్స్య సొసైటీలకు ఎన్నికల నిర్వహణ, నూతన జిల్లాల వారీగా కొత్త సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గొర్రెల పంపిణీకి వీడియో రికార్డింగ్..

ఎన్ సిడిసి నుంచి నిధులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో గొర్రెల కొనుగోలు నుంచి లబ్ధిదారుడి ఇంటి వద్దకు యూనిట్లు చేరేవరకు వీడియో రికార్డింగ్ చేస్తూ పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని షీప్ కార్పోరేషన్ అధికారులకు సూచించారు. మరణించిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేయాలని, చనిపోయిన గొర్రెల స్థానంలో గొర్రెలను కొనుగోలు చేసి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1.97కోట్ల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును అందించినట్టు పేర్కొన్నారు. కాగా నాణ్యమైన మేలు జాతి పాడి పశు సంపద వృద్ధి కోసం చేపట్టిన కృత్రిమ గర్భధారణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న పాడి గేదెల పంపిణీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో షీప్ అండ్ గోట్ కార్పోరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు, స్పెషల్ చీఫ్​ సెక్రటరీ అధర్ సిన్హా, ఎనిమల్ హస్బెండరీ డైరక్టర్ రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం.భూక్య, టీఎస్ఎల్ డిఏ సీఈవో మంజువాణితో పాటు వెటర్నరీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ వీరోజీరావు పాల్గొన్నారు.


Similar News