డిసెంబర్ 4 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ఎస్సీ కమిషన్
ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 4, న సంగారెడ్డి జిల్లాలో పర్యటించి బహిరంగ విచారణను కొనసాగిస్తామని, ఇతర ఉమ్మడి జిల్లాల్లో తమ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు, ప్రభుత్వ ఉద్యోగాలు.. చదువులలో రిజర్వేషన్లు పొందిన వారిని గుర్తించి సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేయ నున్నారు. బుధవారం ఎస్సీ కమిషన్ కు వివిధ సంఘాల నుంచి వినతులు అందాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా మాలలు తమకు క్రిమిలేయర్ ను అమలు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని కమిషన్ పరిశీలిస్తుందన్నారు.
ఎస్సీ కోటా కింద లబ్ధి పొందిన వారు తిరిగి వారి పిల్లలు, వాళ్ల పిల్లలు లబ్ధి పొందుతున్నారని కిందిస్థాయి వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని మాలలు అభిప్రాయపడుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడమే కాకుండా, వివిధ ప్రభుత్వ శాఖల్లో 2004,2006 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలను కమిషన్ కు ఇవ్వాలని సూచించామన్నారు. దీని ఆధారంగా ఎక్కువ రిజర్వేషన్లు అనుభవించిన కులాల ను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, వర్గీకరణ సులభతరమవుతుందన్నారు. కమిషన్ ఏర్పాటు చేయక ముందు ఎస్సీ శాఖకు 2000 లకు పైగా వినతులు, కమిషన్ కు 14 వినతులు వచ్చాయని వీటన్నింటిని పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాల పర్యటనలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగ నియామాకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. వీటన్నింటిని సమగ్రంగా అధ్యయనం చేసి జనవరి రెండో వారంలో ప్రభుత్వానికి కమిషన్ తుది నివేదికను అందజేస్తామని తెలిపారు.