రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సమగ్ర ఇంటింటి సర్వే బుధవారం నాటికి 95 శాతం పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సమగ్ర ఇంటింటి సర్వే బుధవారం నాటికి 95 శాతం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ సర్వేలో మొత్తం 1,18,02,726 నివాసాలు గుర్తించారు. ఇప్పటి వరకు 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తయిందన్నారు. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు. సేకరించిన వివరాలను అధికారులు కంప్యూటరీకరించడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వేగంగా సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అత్యధికంగా 70.3 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 59.8 శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు సేకరించిన సమాచారంలో 29,82,034 నివాసాల సర్వే సమచారాన్ని కంప్యూటరీకరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా, 20,15,965 నివాసాల్లో సర్వే పూర్తి చేసి 80.5 శాతానికి చేరుకుందని వెల్లడించారు. సర్వే పత్రాలను సమగ్రంగా భద్రపర్చడంతో పాటు తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.