దూకుడు పెంచిన ముఖ్యమంత్రి.. వారికి కంటిమీద కునుకు కరువు!

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి జగన్ ముందస్తు వ్యూహంలో భాగంగానే డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నారా..?

Update: 2022-03-12 02:51 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి జగన్ ముందస్తు వ్యూహంలో భాగంగానే డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నారా..? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని తెలిసినప్పటికీ సంక్షేమ పథకాలకే పెద్దపీట వేయడం వెనుక ఉద్దేశం ఏంటి..? తెలంగాణ రాష్ట్రంతో పోటీపడి మరీ బడ్జెట్ ప్రవేశపెట్టడం వెనుక వ్యూహం ఉందా...? ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సీఎం అటు ప్రతిపక్షాన్ని కంటిమీద కునుకులేకుండా చేయడంతోపాటు ఇటు అప్పులు ఇవ్వకుండా కేంద్రం వేధిస్తున్నదని పాలనపట్ల చేతులెత్తేసి ముందస్తుకు వెళ్లడమేనా? ఇవే ప్రశ్నలు విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉందని.. అప్పులు పేరుకుపోయాయని తెలిసి కూడా అత్యధిక నిధుల కేటాయింపులు సంక్షేమ పథకాలకు కేటాయించడం, అలాగే ఓటర్లను ఆకర్షించే విధంగా ముఖ్యంగా బీసీలకు దగ్గరయ్యేందుకు భారీ నిధుల కేటాయింపులు చేయడం ముందస్తు ప్లాన్‌లో భాగమేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి అటు బీజేపీ, జనసేన సైతం ముందస్తు వ్యూహం అని ప్రచారం చేస్తున్నా సీఎం జగన్ మాత్రం మౌనం వహించడం విపక్షాలను ఓ చోట కుదురుగా కూర్చోనివ్వని పరిస్థితి. అటు టీడీపీ, ఇటు బీజేపీ, మరోవైపు జనసేనలు ముందస్తుకు సిద్ధంగా లేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో సీఎం జగన్‌ ముందస్తకు వెళ్తే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి.

ముందస్తు వ్యూహంలో భాగమేనా?

సీఎం జగన్ ఇటీవల డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలకు సైతం దొరక్కుండా.. దొరికినా చేతికి చిక్కకుండా... చివరకు ప్రతిపక్ష పార్టీనే ప్రజల్లో దోషిని చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు శాశ్వత అభివృద్ధి అంతగా లేదనేది బహిరంగ రహస్యం. ఇది వైసీపీకి ముఖ్యంగా సీఎం జగన్‌కు సైతం తెలుసు. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే జగన్ పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా నవరత్నాలు, సంక్షేమ పథకాలు, వైద్య-ఆరోగ్యం, విద్య వంటి రంగాలకే అగ్రతాంబూలం ఇస్తూ వస్తున్నారు. పేదలతోపాటు అగ్రవర్ణాలలోని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు దగ్గరయ్యేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన బీసీ సామాజిక వర్గాలను తమవైపునకు తిప్పుకునేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల కాలంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు కీలక పదవులు సైతం బీసీలకు కట్టబెడుతున్నారు. బడ్జెట్‌లో సైతం భారీగానే నిధుల కేటాయింపులు జరిగాయి. బీసీ సబ్ ప్లాన్, బీసీ కార్పొరేషన్లకు ఇతర సామాజిక వర్గాల కంటే అత్యధికంగా నిధుల కేటాయింపులు చేశారు. ఇవన్నీ ఎన్నికలకు రెండేళ్ల ముందే చేస్తున్నారంటే ఇదంతా ముందస్తు వ్యూహమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ నిత్యం ప్రజల్లో ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. వాటిలో లోపాలను టీడీపీ పట్టుకునే లోపు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముందస్తు వ్యూహంలో భాగమేననే ప్రచారం జరుగుతోంది.

దూకుడు నిర్ణయాలతో విపక్షాల్లో టెన్షన్

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా గందరగోళానికి గురి చేశాయి. ఆ పార్టీలోని నేతలు సైతం బహిరంగంగా అధినేత నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. రానురాను జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ గందరగోళంలో పడేస్తున్నాయి. దాదాపు మూడేళ్లపాటు అమరావతి రాజధాని అంశాన్ని అస్త్రంగా చేసుకుని సీఎం జగన్ రాజకీయం నెరిపారు. రాజకీయం కేవలం 29 గ్రామాలకే పరిమితం చేసేలా రాజకీయ చతురత ప్రదర్శించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరుకున పడేసేలా చేశారు. ఇంతలో మళ్లీ మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకోవడం.. కొత్త బిల్లులు పెడతామని ప్రకటించడం జరిగిపోయింది. తాజాగా హైకోర్టు తీర్పుతో మళ్లీ రాజధాని అంశంపై జగన్ నోరు మెదపడం లేదు. కానీ వైసీపీలోని కీలక నేతలు మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. దీంతో విపక్షాలు సైతం జగన్ విధానాలను, వ్యూహాలను అంచనా వేయలేక తలలు పట్టుకుంటున్నాయి. కొత్త జిల్లాల విభజన అంశాన్ని సడన్‌గా తీసుకొచ్చారు. ఈ అంశంలో కూడా టీడీపీని దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణపై కేబినెట్‌లో సంకేతాలివ్వడం చూస్తుంటే ముందస్తుకు వెళ్తారంటూ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న జగన్ సమయం చూసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోతారంటూ ఊహాగానాలు వినబడుతున్నాయి.

జూన్ నుంచి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు

సీఎం జగన్ ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. ప్రజలతో మమేకం అవ్వాలని దిశానిర్దేశం చేశారు. అలాగే తాను ఎమ్మెల్యేలతో వన్ టు వన్ చేస్తానని కూడా ప్రకటించేశారు. తాజాగా శుక్రవారం కేబినెట్ భేటీలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించేశారు. విస్తరణ ఇంకా చేపట్టకుండానే మాజీలకు జిల్లాల ఇన్‌చార్జిల బాధ్యతలు ఇస్తామని కూడా ప్రకటించేశారు. వీరంతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్న వారు రాబోయే రోజుల్లో పార్టీకి హ్యాండిచ్చే ప్రమాదం ఉందని భావించిన జగన్ మంత్రి వర్గ విస్తరణకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. ఇది కూడా ముందస్తు వ్యూహంలో భాగమేనని కూడా విపక్షాలు గుసగుసలాడుతున్నాయి. ఒకవైపు జూన్ నెల నుంచే ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో ఉండాలని ఆదేశించడం.. మేలో ఎన్నికల వ్యూహకర్త పీకే టీం రాష్ట్రంలో అడుగు పెడుతుందని సంకేతాలు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే జగన్ ముందస్తుకు పక్కా ప్రణాళికతో వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

జగన్ ముందస్తుకెళ్తారంటున్న బీజేపీ

ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేనలు మాత్రమే వైసీపీ ముందస్తుకు వెళ్తుందని ఆరోపించాయి. తాజాగా బీజేపీ సైతం సీఎం జగన్ ముందస్తుకు వెళ్తారని చెప్తోంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా బడ్జెట్‌పై స్పందిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిందేనని ఇన్ని అప్పులు చేయలేక ప్రభుత్వాన్ని ఉపసంహరించుకుని ముందస్తుకు వెళ్తారంటూ జోస్యం చెప్పారు. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉందని అది పెరగకముందే జగన్ కచ్చితంగా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తారని బీజేపీ అంటోంది. దేశవ్యాప్తంగా బీజేపీ వేవ్ నడుస్తోంది. అసలే నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా దాన్ని సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది.

అసలు గుట్టు ఇదేనా?

రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు సంక్షేమానికే అనడంలో సందేహం లేదు. నవరత్నాలు, సంక్షేమ పథకాలకే అగ్రతాంబూలం ఇచ్చారు. అత్యధికంగా విద్యకు ప్రాధాన్యం కల్పించారు. అలాగే వైద్యరంగానికి కూడా భారీగానే కేటాయింపులు చేశారు. ఇంకా అమ్మఒడి, పెన్షన్ పథకం ఇతర పథకాలకు సైతం గతంలో కంటే భారీగా పెంచి కేటాయింపులు చేశారు. ఇవన్నీ నెరవేర్చాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా ఉండాలి. కానీ ఆదాయం వేల కోట్లలో ఉంటే ఖర్చు మాత్రం లక్షల కోట్లలో ఉంది. ఇప్పటికే పాలనకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ స్థలాలను తనఖా పెట్టేశారు. మద్యంపై వచ్చే సొమ్ము అలాగే పార్కులు, రాజధాని భూములు ఇలా అందివచ్చిన ప్రతీ దాన్ని తనఖా పెట్టేస్తున్నారు. ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెడుతోంది. మరోవైపు కేంద్రం రుణాలు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ విషయాన్ని క్యాష్ చేసుకుని సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు మరో ఏడాదిలోపు వెళ్తే జనసేన, బీజేపీలు సంసిద్ధం కాలేవని... టీడీపీ సైతం ఎన్నికలను ఎదుర్కొనేందుకు అంతగా ఏర్పాట్లు చేసుకోలేదని ఇదే సమయంలో సందట్లో సడేమియా అన్నట్లు మరోసారి అధికారంలోకి రావొచ్చని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సీఎం జగన్ వ్యూహం వెనుక పీకే ఉన్నారా లేక పీకే ఈ వ్యూహాన్ని మారుస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News