Bhatti Vikramarka: పంట రుణాల పంపిణీలో స్పీడ్ పెంచాలి.. బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం సూచన
పంట రుణాల పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులను ప్రజల్లోకి వదులుతోందని అందుకు అనుగుణంగా మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు బ్యాంకులు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం ప్రజాభవన్ లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో (State Lever Bankers' Conference) కీలక అంశాలపై భట్టి విక్రమార్క చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నామని దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే అది వృథా అని, రబీ పంట రుణాల పంపిణీలో వేగం పెంచి రైతులకు సకాలంలో రుణాలు అందించాలని బ్యాంకర్స్ కు సూచించారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు టెండర్లు పిలుస్తామని, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయం సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
రైతులను దృష్టిలో ఉంచుకుని పథకాలు చేయండి: తుమ్మల
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాల రూపకల్పన చేయాలని బ్యాంకర్లకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు స్వంతగా నిర్వహించేలా చేయాలని సూచించారు. బ్యాంకులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతే అది భవిష్యత్ కు నష్టం అన్నారు. బ్యాంకులు ఇచ్చిన అప్పులపై అజమాయిషీ లేకుండా పోయిందన్నారు. బ్యాంకు అప్పులను తిరిగి కట్టేవాళ్లు కడుతుంటే ఎగ్గొట్టేవాళ్లు ఎగ్గొడుతూనే ఉన్నారని దాంతో అర్థం లేకుండా పోతున్నదన్నారు.
భూసంస్కరణలకు ఆధ్యుడు పీవీ: భట్టి
భూసంస్కరణల విషయంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహరవు (PV Narsimha Rao) తీసుకువచ్చిన సంస్కరణలు భారతదేశ చరిత్రలో ఓ విప్లవాత్మక చర్య అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూసంస్కరణతో పేదల పెన్నిదిగా ఆయన నిలిచారని కొనియాడారు. పీవీ 20వ వర్థంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమి వద్ద మంత్రి తుమ్మలతో కలిసి భట్టి విక్రమార్క ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో పోటీ పడేలా చేసిన ఘనత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుదేనన్నారు. ఆయన మన తెలంగాణలో పుట్టడంలో మనందరి అదృష్టం అన్నారు. ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ పరిపాలనలో ఆదర్శంగా ఉన్నాయన్నారు.