పొలిటికల్ అడ్డాగా సోషల్ మీడియా.. రూ. కోట్లు ఖర్చు చేస్తున్న పార్టీలు

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నాయి. చివరి ఏడాది ఎలాగూ..Political Parties Following Social Media Trends

Update: 2022-04-03 02:13 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నాయి. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల హంగామా ఉంటుంది. అంటే కేవలం మధ్యలో ఉండేది ఒక్క ఇయర్ మాత్రమే. దీంతో ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్‌కు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు సోషల్ మీడియాలో యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అటు ఫేస్‌బుక్, ఇటు ట్విట్టర్, మరోవైపు వాట్సాప్, ఇంకోవైపు యూట్యూబ్‌ ఇలా ప్రసార మాధ్యమాలలో ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. యూత్‌ను ఆకట్టుకునేందుకు సినీడైలాగులతో కూడిన పొలిటికల్ పంచ్‌లు పేలుస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా స్మార్ట్ క్యాంపెయిన్ నిర్వహించేస్తున్నారు. ప్రభుత్వ లొసుగులు, పొరపాట్లను టీడీపీ ప్రజల మైండ్‌లోకి ఇంజెక్ట్ చేస్తుంటే.. అటు వైసీపీ సైతం టీడీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మెుత్తానికి సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. పార్టీ అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు చాలా మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ రాజకీయరంగానికి మరింత పదునుపెడుతున్నారు. జూమ్ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఒక పొలిటికల్ యుద్ధమే నిర్వహిస్తున్నారు. ఇలా ప్రజల మధ్య తిరగకుండా సోషల్ మీడియా వేదికగా రాజకీయ చిచ్చురగుల్చుతూనే ఉన్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలతో షేక్ చేస్తున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరైతే శృతి మించి విమర్శలు చేస్తూ జైలుపాలవుతున్న సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసిన సంగతి తెలిసిందే. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనతోపాటు ఇతర పార్టీలు చేసే విమర్శలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

పొలిటికల్ అడ్డాగా సోషల్ మీడియా

రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇన్విటేషన్‌లు, అభిప్రాయాలను పంచుకునేందుకు.. సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయరంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఒక పొలిటికల్ యుద్ధమే జరుగుతుంది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి అప్పుడు జరిగే ఎన్నికల ప్రచారం తంతు అటు ఉంచితే సోషల్ మీడియాలో నిత్యం జరిగే పొలిటికల్ ట్విట్టర్ వార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీల నడుమ సోషల్ సమరం పతాకస్థాయికి చేరుకుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయా పార్టీల అధ్యక్షుల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అంతా సోషల్ మీడియానే విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రతి నేత ఒక సోషల్ మీడియా టీంను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. ఆ టీంతో చేసేది గోరంత పబ్లిసిటీ చేసుకునేది కొండంత అన్న చందంగా నేతలు తయారయ్యారు. రాష్ట్రంలో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారి సంఖ్య నాలుగు కోట్లకుపైనే ఉందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకున్నాయి. యువతను, అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆకట్టుకునేందుకు చేసే పోస్టులు, ట్వీట్లు ఆద్యంతం ఆసక్తిరేపుతూనే ఉంటున్నాయి. ఇక కొంతమంది నాయకులు అయితే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి మరీ పొలిటికల్ రగడ సృష్టిస్తున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇప్పుడు అన్ని పార్టీలు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి ఏం చెప్పదలచుకుందో వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై వదిలేస్తోంది. దాన్ని అలా పార్టీ కార్యకర్తలు, అభిమానులు షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారుగా వారి పార్టీలకు చెందిన ప్రచారాల వీడియోలు, అనుకూల పోస్టులు పెడుతుంటే వాటికి వ్యతిరేకంగా ఇతర పార్టీల నాయకులు పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌లలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. కొందరైతే ఎదుటి పార్టీల నాయకులపై వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

వైసీపీ గెలుపులో కీలకపాత్ర సోషల్ మీడియాదే

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముఖ్యభూమిక పోషించింది సోషల్ మీడియానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రచారం ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్లింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే టీడీపీని సైతం బలంగా ఢీకొట్టింది. దీంతో వైసీపీ గెలుపు సునాయాసంగా మారిందని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు చెప్తూ ఉంటారు. తమ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ నియోజక వర్గాలను చుట్టేస్తుంటే.. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రభుత్వ లొసుగులు, పొరపాట్లను ప్రజల మైండ్‌లోకి ఇంజెక్ట్ చేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన 'రావాలి జగన్'.. సాంగ్ అందర్నీ పార్టీకి దగ్గర చేసింది. ముఖ్యంగా వైఎస్ జగన్ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశో‌ర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ సోషల్‌ మీడియా ప్రచార నిర్వహణను పర్యవేక్షించేది. ప్రశాంత్ కిశోర్ తన అనుభవాన్ని రంగరిస్తూ సోషల్‌మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అలాగే ఐప్యాక్ టీం వైసీపీకి సంబంధించిన స్లోగన్‌లను ఐటీ నిపుణుల ద్వారా.. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నిన్ను నమ్మం బాబు, బైబై బాబు, ఏపీ విత్ వైఎస్ఆర్‌సీపీ హ్యాష్‌ ట్యాగ్‌లతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

కొత్తపుంతలు తొక్కుతున్న టీడీపీ

2014 ఎన్నికలప్పటి నుంచీ టీడీపీ సోషల్ మీడియాను బలంగా నమ్మింది. ఫేస్‌బుక్ ద్వారా పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలు, అభిమానుల దగ్గరకు చేరవేసేది. ట్విట్టర్‌ను సైతం చంద్రబాబు, లోకేశ్‌తోపాటు స్టార్ కాంపైనర్లు ఉపయోగించేవారు. అంతేకాదు ఒక్కో వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో నేతలు హల్‌చల్ చేశారు. 2019 ఎన్నికల్లోనూ అదే ఒరవడిని టీడీపీ ప్రదర్శించింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌ల‌లో విపరీతమైన ప్రచారం చేసింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురుతో ప్రత్యేకంగా యాడ్‌లను సైతం ప్రజల్లోకి వదిలారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు మొద‌లైన‌వాటికి ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేసి ఊద‌ర‌గొట్టారు. మంత్రులు, అభ్యర్థులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో జరిగిన‌, జ‌రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకున్నారు. అయితే ఐప్యాక్ టీంతోపాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎదుట బొక్క బోర్లాపడ్డారు. దీంతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ఓటమిపై సమీక్షించిన చంద్రబాబు, నారా లోకేశ్‌లు వైసీపీ గెలుపులో సోషల్ మీడియా అత్యంత కీలకంగా మారిందని గ్రహించారు. 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబు, లోకేశ్‌లు సోషల్ మీడియాను అవకాశం దొరికినప్పుడల్లా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు ఇతర నాయకుల పర్యటనలకు సంబంధించి, ప్రజల సమస్యలను వెంటనే ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ వేదికల ద్వారా బహిరంగ పరుస్తున్నారు. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెడితే చాలు లైవ్ కూడా యూట్యూబ్‌ ద్వారా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించి వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను క్రియేట్ చేసి పార్టీ విధానాలను, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు చంద్రబాబు సైతం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని పలు ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తున్నారు. జూమ్‌, టెలీకాన్ఫరెన్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

దూకుడు పెంచిన జనసేన

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా సోషల్ మీడియా ప్రజలను ప్రభావితం చేస్తుందని గ్రహించిన పవన్ కల్యాణ్ అత్యధిక శాతం సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా వేదికగా నిరసనలకు పిలుపునిస్తున్నారు. జనసేన నిర్వహించిన రోడ్ల గుంతల ఉద్యమం సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇచ్చిన పలు ఉపన్యాసాలు సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. అలాగే రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఘోరాలు, దారుణాలతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలపై పవన్ కల్యాణ్ నిత్యం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అటు అభిమానులు, పార్టీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని బాగా షేర్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న సినీ గ్లామర్‌ను క్యాష్ చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ అధినేతకు క్రేజ్ పెంచుతున్నారు. బీజేపీ కూడా తానేమీ తక్కువకాదు అన్నట్లు వ్యవహరిస్తోంది. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్థన్ రెడ్డి, సత్యకుమార్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.

పొలిటికల్ అడ్డాగా సోషల్ మీడియా.. రూ. కోట్లు ఖర్చు చేస్తున్న పార్టీలు

సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎక్కువ మందిని తమ వైపు ఆకర్షించేందుకు ఐటీ, సోషల్‌ మీడియా వింగ్‌ల ద్వారా రాజకీయ పార్టీలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలు సోషల్ మీడియాను ఒక అస్త్రంగా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌ల ప్రసంగాన్ని ఒకవైపు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూనే మరోవైపు వారి ప్రసంగాల్లో హైలెట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రచారంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ, టీడీపీ, ఆప్‌, సమాజ్ వాదీ పార్టీలు టాప్ 10లోపు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాకు అత్యధిక ఖర్చు వెచ్చిస్తున్న పార్టీలలో వైసీపీ, టీడీపీలు ఉన్నాయి.

Tags:    

Similar News