ఆ స్థలం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్న నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ latest telugu news..

Update: 2022-03-05 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రస్టు బోర్డు సభ్యులు శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాదులోని BIACH&RI బోర్డు సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్‌తో పాటూ ట్రస్టు బోర్డు సభ్యులు నామా నాగేశ్వర రావు, పార్లమెంట్ సభ్యులు జె ఎస్ ఆర్ ప్రసాద్, నారా బ్రాహ్మణి తో పాటు అమెరికాకు చెందిన ట్రస్టు బోర్డు సభ్యులు డా. రాఘవరావు పోలవరపు, డా. దత్తాత్రేయ నోరి లు కూడా నేరుగా, ప్రత్యక్షంగా హాజరై విషయాన్ని సమగ్రంగా సమీక్షించి చర్చించారు.

అనంతరం నానాటికీ పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు సంబంధించిన అవసరాలను గమనించిన BIACH&RI ట్రస్టు బోర్డు హాస్పిటల్ విస్తరణ కోసం సరైన ప్రత్యామ్నాయ వేదిక కోసం వెతకాలని తీర్మానించి పలు ప్రదేశాలు, బిల్డింగ్ లను పరిశీలించడం జరిగింది. అయితే అవి సమగ్రమైన క్యాన్సర్ చికిత్స కేంద్రాన్ని నెలకొల్పడానికి అనువుగా లేకపోవడంతో మరో 500 పడకల క్యాన్సర్ చికిత్స కేంద్రానికి అవసరమయ్యే రీతిలో చికిత్సకు వచ్చే రోగులకు అనువైన చోట 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించి అందుకనుగుణంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. స్థలాన్ని కేటాయించిన వెంటనే నిధులు సమకూర్చుకొని హాస్పిటల్ నిర్మాణానికి పూనుకోవాలని ట్రస్టు బోర్డు తీర్మానించడమే కాకుండా స్థలం అందించిన తర్వాత అత్యంత స్వల్ప కాల వ్యవధిలోనే ఈ సరికొత్త చికిత్స కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

ఇలా సరికొత్త స్థలం కేటాయించాలని కోరడంతో పాటు ప్రస్తుతం హాస్పిటల్ ఉన్న స్థలం యొక్క లీజు గడువు 30 సంవత్సరాల కాలం పూర్తి కావస్తున్నందున లీజు గడువును 99 సంవత్సరముల కాలానికి పొడిగించాలని లేదంటే సదరు స్థలాన్ని హాస్పిటల్ కి శాశ్వతంగా కేటాయించేందుకు వీలు కల్పించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారిని కోరుతూ నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో ట్రస్టు బోర్డు సభ్యులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అనుగుణంగా త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడం ద్వారా తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News